Rahul Dravid: ‘ఒకరి కోసం కప్‌ గెలవాలి’.. నేను ఇలాంటివి అస్సలు నమ్మను: ద్రవిడ్

టీ20 ప్రపంచకప్‌లో రెండోసారి విజేతగా నిలవాలని టీమ్‌ఇండియా ఎదురుచూస్తోంది. ఇప్పుడా అవకాశం వచ్చింది. పొట్టి కప్‌ 2024లో ఫైనల్‌కు చేరింది.

Published : 28 Jun 2024 15:08 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌కిదే చివరి మెగా టోర్నీ. ఈనెల తర్వాత అతడు కోచింగ్‌ బాధ్యతలను వేరొకరికి అప్పగించనున్నాడు. దీంతో అతడికోసమైనా ఈసారి కప్‌ నెగ్గాలనే కామెంట్లు వస్తున్నాయి. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. అయితే, తాను ఇలాంటివాటిని అస్సలు నమ్మనని.. ఎవరి కోసమో ఏదీ చేయకూడదని ద్రవిడ్ (Rahuk Dravid) వ్యాఖ్యానించాడు. 

‘‘ఫలానా వ్యక్తి కోసం అది చేయండి. ఇది చేయండి అని చెబుతుంటారు. అయితే, ఇలాంటివి నేను అసలు నమ్మను. ఎవరినైనా ‘మీరు ఎవరెస్ట్‌ను ఎందుకు ఎక్కాలని అనుకుంటున్నావు?’ అని అడిగితే.. అతడు ‘అక్కడ అది ఉంది కాబట్టే నేను ఎక్కుదామనుకున్నాను’ అని చెబుతారు. అదే ప్రశ్నను ఆటగాళ్లను అడిగితే ‘ వరల్డ్ కప్‌ ఇక్కడుంది. అందుకే గెలవాలని భావిస్తున్నా’ అని చెప్పాలి. అంతేకానీ, ఇది కొందరి కోసమో, ఒకరికి అంకితం చేయడానికో కాదు.   మా జట్టు నుంచి నాణ్యమైన క్రికెట్ రావాలని మాత్రమే కోరుకుంటా. అంతేకానీ, నా కోసం కప్‌ గెలవాలనే దానికి నేను విరుద్ధం. అసలు దానిగురించే మాట్లాడాలనుకోను’’ అని ద్రవిడ్ వెల్లడించాడు.

విరాట్ గురించి..

‘‘అత్యుత్తమ క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నించినప్పుడు కొన్నిసార్లు ఫలితాలు సానుకూలంగా రావు. అలాంటి సమయంలో అతడు విఫలమైనట్లు భావించనక్కర్లేదు. విరాట్ కోహ్లీ (Virat Kohli) విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సిక్స్‌ కొట్టాడు. అదే దూకుడు ప్రదర్శించే క్రమంలో ఔటయ్యాడు. అతడి ఆటతీరును ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కోహ్లీ యాటిట్యూడ్ సూపర్. తప్పకుండా మున్ముందు అతడి బ్యాట్‌ నుంచి పరుగులు వస్తాయి’’ అని కోచ్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని