India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. మార్చి 1న భారత్-పాక్ మ్యాచ్!

వచ్చే ఏడాది (2025)లో జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 1న భారత్-పాక్ మ్యాచ్‌ జరిగే అవకాశముంది. 

Published : 03 Jul 2024 21:36 IST

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది (2025)లో జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీ కోసం పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు మొత్తం 15 మ్యాచ్‌లు నిర్వహించాలనుకుంటోంది. ఈ మేరకు డ్రాప్ట్ షెడ్యూల్‌ని పీసీబీ.. ఐసీసీకి అందజేసింది. దీని ప్రకారం చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ మ్యాచ్‌ మార్చి 1న లాహోర్‌లో జరగనుంది. అయితే, ఈ డ్రాప్ట్ షెడ్యూల్‌కు బీసీసీఐ ఇంకా సమ్మతి తెలపలేదని ఐసీసీ సీనియర్ సభ్యుడు ఒకరు తెలిపారు. ఏడు మ్యాచ్‌లు లాహోర్‌లో, మూడు మ్యాచ్‌లు కరాచీలో, ఐదు మ్యాచ్‌లను రావల్పిండిలో నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు.  

కరాచీ, రావల్పిండి రెండు సెమీ ఫైనల్స్‌, లాహోర్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భద్రతాపరమైన, రవాణా కారణాల దృష్ట్యా భారత్‌ మ్యాచ్‌లన్నింటినీ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంకు పరిమితం చేశారు. భారత్‌ సెమీ ఫైనల్‌కు క్వాలిఫై అయితే ఆ మ్యాచ్‌ కూడా అక్కడే నిర్వహిస్తారు. గ్రూప్‌ ఎలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్.. గ్రూప్‌ బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆటగాళ్ల భద్రత, ఇతర కారణాల వల్ల టీమ్‌ఇండియా చాలాకాలంగా పాక్‌ పర్యటనకు వెళ్లడం లేదు. భారత జట్టు చివరిసారిగా 2008 ఆసియా కప్‌ కోసం అక్కడికి వెళ్లింది. గతేడాది ఆసియా కప్‌ మ్యాచ్‌లను కూడా హైబ్రిడ్ విధానంలో నిర్వహించారు. పాకిస్థాన్‌లో 4 మ్యాచ్‌లు, మిగతా 9 మ్యాచ్‌లు శ్రీలంకలో ఆడేలా షెడ్యూల్ రూపొందించారు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం పాక్‌లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తేనే టీమ్ఇండియా ఛాంపియన్స్‌ ట్రోఫీకి వెళ్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని