IND vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీస్‌.. మన బౌలింగ్‌కు ఎదురుందా..?

సెమీస్‌ పోరులో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. మన బౌలింగ్‌ దళం ఎంతో పటిష్ఠంగా కనిపిస్తోంది.

Updated : 26 Jun 2024 19:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా పొట్టి ప్రపంచకప్‌ విజేతగా నిలవడానికి మరో రెండడుగుల దూరంలోనే ఉంది. ఈసారి కప్‌ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని పట్టుదలగా ఉంది. వరుస విజయాలతో సెమీస్‌కు చేరిన టీమ్‌ఇండియానే పేవరెట్‌గా కనిపిస్తోంది. అన్ని విభాగాల్లో రాణిస్తోంది. ఇక మన బౌలింగ్‌ విభాగం గురించి ఎంత చెప్పినా తక్కువే.

  • బుమ్రా నేతృత్వంలోని పేస్‌ దళాన్ని ఎదుర్కోవడం ఏ జట్టుకైనా కష్టమే. గ్రూప్‌ దశలో అమెరికాలో కఠిన పరిస్థితులు ఉన్న పిచ్‌లపై స్వల్ప స్కోర్లను కూడా కాపాడుకున్నామంటే అది మన బౌలింగ్‌ విభాగం ఘనతే.
  • ఇక స్పిన్నర్లు కూడా చక్కగా రాణిస్తున్నారు. స్పిన్‌కు సహకరించే విండీస్‌ పిచ్‌లపై కుల్‌దీప్‌ సత్తా చాటుతున్నాడు. మిడిల్‌ ఓవర్లలో ప్రభావాన్ని చూపుతున్నాడు. ఆడిన మూడింట్లో ఏడు వికెట్లు తీశాడు. అక్షర్‌ పటేల్‌ 5 వికెట్లతో ఆకట్టుకుంటున్నాడు.
  • హార్దిక్‌ పాండ్య ఆల్‌రౌండర్‌ పాత్రను చక్కగా పోషిస్తున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ.. జట్టు విజయాల్లో పాలుపంచుకుంటున్నాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లతో సత్తా చాటాడు.
  • ఇక కొత్తబంతితో అర్ష్‌దీప్‌సింగ్‌ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటి వరకూ 15 వికెట్లు పడగొట్టి భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో ఎక్కువ వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గానూ ఉన్నాడు.
  • ఇక బుమ్రా టీమ్‌ఇండియాకు అతిపెద్ద బలం. బుల్లెట్‌లా దూసుకొచ్చే అతడి బంతులను కాచుకోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలే. ఏ సమయంలోనైనా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీసే సత్తా అతడి సొంతం. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ప్రస్తుత టోర్నీలో ఇప్పటి వరకూ 11 వికెట్లు తీశాడు.
  • బుమ్రాకు ఇంగ్లాండ్‌పై చక్కటి రికార్డు ఉంది. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ ఆ జట్టుతో ఆడిన నాలుగు మ్యాచ్‌లో మొత్తం ఏడు వికెట్లు తీశాడు. ఇందులో ఒక మెయిడిన్‌ ఉంది. మూడు వికెట్లు ఒకే మ్యాచ్‌లో రాబట్టాడు. 
  • ఇంగ్లాండ్‌తో రెండో సెమీ ఫైనల్‌ జరిగే గయానాలో పరిస్థితులు మన బౌలింగ్‌ యూనిట్‌కు చక్కగా సరిపోతాయని పలువురు విశ్లేషిస్తున్నారు. అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా మన బౌలింగ్‌ దళం ఉందని మాజీ ఆల్‌రౌండర్‌ రాబిన్‌ సింగ్‌ పేర్కొన్నాడు. ఈ వేదికపై ఇండియాదే పైచేయి అవుతుందన్నాడు.
  • ఇక ఇంగ్లాండ్‌ బౌలర్లలో ప్రమాదకరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌లను ఎదుర్కోవడంపైనే భారత దృష్టి పెట్టాల్సి ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని