Pak Cricket Team: బాబ్బాబు.. 2500 డాలర్లు ఇవ్వండి వచ్చేస్తాం: ఈవెంట్లకు హాజరైన పాక్‌ ప్లేయర్లు

పాకిస్థాన్‌ క్రికెటర్లు చేసిన ఒక్కో విషయం తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. వరల్డ్‌ కప్‌ కోసం కుటుంబాలను వెంట తీసుకెళ్లిన వారు.. ప్రత్యేకంగా ఈవెంట్లలోనూ పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Updated : 26 Jun 2024 15:29 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ స్టేజ్‌లోనే నిష్క్రమించడంతో పాకిస్థాన్‌పై ఆ దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. క్రికెట్ ఆడటానికి వెళ్లారా? కుటుంబాలతో హాలిడే ట్రిప్‌లకు వెళ్లారా? అని మాజీలు ప్రశ్నించారు. కొందరు పాక్‌ క్రికెటర్లు వెంటనే స్వదేశానికి వెళ్లకుండా ఉండిపోయారు. యూఎస్‌ఏతోపాటు ఇంగ్లాండ్‌లో గడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే, పీసీబీ తీవ్రంగా స్పందించడంతో పాక్‌కు చేరుకున్నారు. తాజాగా మరో విషయం క్రికెట్ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది. ఈవెంట్లలో పాల్గొనేందుకు పాక్‌ క్రికెటర్లు చాలా తక్కవ మొత్తం ఇచ్చినా తీసుకొన్నారని కథనాలు వస్తున్నాయి . డలాస్‌లో ‘ఏ నైట్ విత్ స్టార్స్‌’తోపాటు మరొక ఈవెంట్‌లోనూ పాల్గొన్నారని సమాచారం. క్రికెట్ మ్యాచ్‌లపై దృష్టిపెట్టకుండా క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు విమర్శలు వచ్చాయి. బాబర్ అజామ్‌, షహీన్ అఫ్రిది నేతృత్వంలో జట్టు విడిపోయిందనే కథనాలూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వీరికి పేమెంట్లలోనూ వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం. 

‘‘టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో క్రికెటర్లు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించారని తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఇందులో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది వారిలో చాలామందికి సెంట్రల్ కాంట్రాక్ట్‌లు ఇవ్వడం జరిగింది. వాటిపై పునఃసమీక్షించే పరిస్థితి ఉంది. అందుకోసం పీసీబీ ఛైర్మన్ మోసిన్ నక్వీ కొందరితో ఇప్పటికే చర్చించారు. భవిష్యత్తులో ఆటగాళ్లను క్రమశిక్షణలో పెట్టేందుకు కఠినమైన నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. 

అంపైర్లు దృష్టిపెట్టాలి: ఇంజమామ్‌

భారత్ సెమీస్‌కు చేరుకోవడం.. పాక్‌ లీగ్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టడం ఇప్పటికీ కొందరు మాజీ క్రికెటర్లకు మింగుడుపడటం లేదు. దీంతో టీమ్‌ఇండియా మ్యాచ్‌లపై ఓ కన్నేసి విమర్శలు చేయడం ప్రారంభిస్తున్నారు. అందులో మాజీ క్రికెటర్ ఇంజామమ్‌ ఉల్‌ హక్ కూడా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భారత్‌ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందని ఆరోపించాడు. ‘‘సాధారణంగా పాత బంతితో రివర్స్‌ స్వింగ్ రాబట్టవచ్చు. కానీ, ఆసీస్‌తో మ్యాచ్‌లో భారత బౌలర్లు కొత్త బంతితో ఎలా రాబట్టారు? అంపైర్లు కాస్త ఇలాంటి వాటిపై దృష్టిపెట్టండి’’ అని వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని