T20 World Cup: ఉత్కంఠ రేకెత్తించిన మ్యాచ్‌లో బెస్ట్‌ ఫీల్డర్‌ ఎవరంటే..

T20 World Cup: తీవ్ర ఉత్కంఠ మధ్య దక్షిణాఫ్రికాపై గెలుపొంది కప్పు కైవసం చేసుకుంది భారత క్రికెట్‌ టీమ్‌. ఈ పొట్టి కప్‌ కోసం జరిగిన తుది మ్యాచ్‌లో జట్టు అన్ని విభాగాల్లో రాణించింది. ఈ సందర్భంగా బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌ ఎవరికొచ్చిందో చూద్దాం..

Updated : 30 Jun 2024 15:19 IST

T20 World Cup | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్కంఠ రేకెత్తిన టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup) తుది మ్యాచ్‌లో ఎట్టకేలకు విజయం భారత్‌ వశమైంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లు చిరస్మరణీయ గెలుపును అందించారు. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. కోట్లాది అభిమానుల కలను నిజం చేశారు. మరి ఇలాంటి చరిత్రాత్మక మ్యాచ్‌లో ఉత్తమ ఫీల్డర్‌ ఎవరై ఉంటారు?... ఇంకెవరు.. చరిత్రలో నిలిచిపోయే క్యాచ్‌తో జట్టు విజయాన్ని ఖాయం చేసిన మన సూర్య కుమార్‌ యాదవే (Surya kumar Yadav)..

కప్‌ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌ ఉత్సాహంతో నిండిపోయింది. ప్లేయర్లంతా ఒక్కచోట కూర్చొని తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ తరుణంలో బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌ ప్రదానం చేయడానికి బీసీసీఐ సెక్రటరీ జైషాను ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్ ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ రోజును మనం జయించాం. నేటితో పాటు టోర్నమెంట్‌ ఆసాంతం మనం చూపిన తెగువ, పట్టుదల అద్భుతం. ద్రవిడ్‌, రోహిత్ ప్రతిఒక్కరికీ తమ పాత్రేంటో తెలుసని చెబుతూనే ఉన్నారు. కానీ, మనం కలసికట్టుగా వచ్చిన ప్రతి అవకాశాన్నీ వేటాడాం. దేన్నీ వదిలిపెట్టలేదు’’ అని దిలీప్‌ అన్నారు.

అనంతరం సూర్యకుమార్‌కు (Surya kumar Yadav) జైషా మెడల్‌ను ప్రదానం చేశారు. దీనిపట్ల సంతోషం వ్యక్తం చేసిన సూర్య.. వరల్డ్‌ కప్‌ మెడల్‌తో పాటు దాన్నీ కెమెరాకు చూపుతూ ఉత్సాహంగా కనిపించాడు.

సూర్య అలాంటివి ఒక 50 పట్టి ఉంటాడు..

మరోవైపు మ్యాచ్ అనంతరం సూర్య క్యాచ్‌ గురించి మాట్లాడుతూ దిలీప్‌ అతడిపై ప్రశంసలు గుప్పించారు. ‘‘ప్రాక్టీస్‌ సమయంలో సూర్య అలాంటి క్యాచ్‌లు ఒక 50 వరకు పట్టి ఉంటాడు. కానీ, ఫీల్డ్‌కు వచ్చే సరికి పరిస్థితులను బట్టి వేగంగా నిర్ణయం తీసుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. బంతిని అంచనా వేయడంతో పాటు బౌండరీని దృష్టిలో ఉంచుకోవాలి. అది చాలా క్లిష్టమైన విషయం. పైకి ఎగరేసి తిరిగి క్యాచ్‌ పట్టగలమన్న విశ్వాసం ఉండాలి. ఇవన్నీ క్షణాల్లో నిర్ణయం తీసుకోవాల్సిన విషయాలు. దాన్ని సూర్య సమర్థంగా చేయగలిగాడు’’ అని దిలీప్‌ వివరించారు.

చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమవగా.. హార్దిక్‌ వేసిన తొలి బంతిని మిల్లర్‌ గాల్లోకి లేపాడు. అది సిక్సర్‌ వెళ్లేలా కనిపించింది. వైడ్‌ లాంగాఫ్‌ నుంచి మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చిన సూర్య (Surya kumar Yadav) ఒక్క ఉదుటన బంతి అందుకున్నాడు. కానీ, నియంత్రణ కోల్పోయి బౌండరీ గీత దాటాడు. అంతలోపే బంతిని గాల్లోకి విసిరాడు. తిరిగి వచ్చి దాన్ని అందుకుని జట్టును ఆనందంలో ముంచెత్తాడు. ఆ అద్భుతమైన క్యాచ్‌తో సూర్య టీమ్‌ఇండియా విజయాన్ని ఖాయం చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని