T20 League: ఆ లీగ్‌.. ఓ సర్కస్‌ లాంటిది: బంగ్లాదేశ్‌ కోచ్‌ సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌ క్రికెటర్లు నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో విఫలం కావడానికి తమ దేశంలో జరుగుతున్న లీగ్‌ కూడా కారణమని ప్రధాన కోచ్‌ వ్యాఖ్యానించాడు.

Updated : 26 Feb 2024 11:11 IST

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌ ప్రధాన కోచ్‌ చండికా హతురుసింఘా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ దేశంలో జరుగుతున్న టీ20 లీగ్‌ మ్యాచ్‌లను చూడకుండా టీవీని ఆపేసిన సందర్భాలున్నాయని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్ల మధ్య సరైన పోటీ వాతావరణం లేదని అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్ (BPL) వల్ల చాలా మంది క్రికెటర్లు వెలుగులోకి వచ్చినప్పటికీ.. అదేమంత గొప్ప టోర్నీ కాదని పేర్కొన్నాడు. 

‘‘బంగ్లాదేశ్‌లో సరైన టీ20 టోర్నమెంట్‌ లేదని చెబుతా. కొందరికి ఈ మాటలు కష్టంగా అనిపించే అవకాశం ఉంది. బీపీఎల్‌ జరుగుతున్న సమయంలో.. కొన్నిసార్లు ఆ మ్యాచ్‌లను చూడలేకపోయా. టీవీ ఆపేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడున్న పద్ధతి నాకస్సలు నచ్చలేదు. అందుకే, అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ఇందులో జోక్యం చేసుకోవాలి. కొన్ని నియమాలను రూపొందించాలి. ఆటగాడు ఒక టోర్నీలో ఆడుతూనే.. మరొక దానిలో పాల్గొంటున్నాడు. ఇదంతా ఓ సర్కస్‌లా ఉంది. కొందరు ప్లేయర్లు తమకు అవకాశాలు వస్తున్నాయని దీనిని సమర్థించుకొంటున్నారు. కానీ, క్రికెట్‌కు ఇది మేలు చేయదు. అభిమానుల్లోనూ ఆసక్తి పోతుంది. నాక్కూడా అలానే జరిగింది. 

బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు కొన్ని విభాగాల్లో నాణ్యమైన సాధన కరవైంది. టాప్‌-3 బ్యాటర్లు దూకుడుగా ఆడే అవకాశం లేదు. అలాగే బౌలర్లకు డెత్‌ ఓవర్లలో రాణించడం అత్యవసరం. ఇలాంటి విషయాలను ఎక్కడ నేర్చుకుంటారు? మనకు ఒక టోర్నీ మాత్రమే ఉంది. అందుకే బీపీఎల్‌కు ముందు మరొకటి నిర్వహిస్తే బాగుంటుంది. కొందరు టాప్‌ ప్లేయర్లు మాత్రం ఇలాంటి వాటిల్లో ఆడకుండా తప్పించుకుంటున్నారు. నైపుణ్యాలను మెరుగుపర్చుకోకపోతే ఇతర జట్లతో పోటీ ఎలా పడతాం?’’ అని చండికా హతురుసింఘా వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని