Haris Rauf: అభిమానితో పాక్‌ క్రికెటర్ మాటల యుద్ధం.. వీడియో వైరల్‌

పాకిస్థాన్‌ పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ అమెరికాలో ఓ అభిమానితో గొడవకు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Published : 19 Jun 2024 00:07 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ 2024లో పాకిస్థాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పేలవమైన ఆటతీరుతో లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లపై పాక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో కొంతమంది పాకిస్థాన్‌ ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లకుండా యూఎస్‌లోనే ఉన్నారు. పేసర్ హారిస్ రవూఫ్‌ (Haris Rauf) కూడా అమెరికాలోనే ఉన్నాడు. రవూఫ్ తన భార్యతో కలిసి ఫ్లోరిడాలోని ఓ హోటల్ ప్రాంగణంలో నడుచుకుంటూ వెళ్తుండగా కొంతమంది ఫ్యాన్స్‌ అతడిని సెల్ఫీల కోసం రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడున్న వారిలో ఎవరు ఏమన్నారో తెలియదు కానీ రవూఫ్‌కు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది.

సహనం కోల్పోయిన హారిస్ రవూఫ్‌ భార్య వారిస్తున్న వినకుండా అక్కడున్న వారివైపు దూసుకొచ్చాడు. కొంతమంది ఆపడానికి ప్రయత్నించినా వినలేదు. ఓ వ్యక్తితో మాటల యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అక్కడున్న వారు ఆపకపోతే దెబ్బలాడుకునేవారే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. రవూఫ్‌ క్రికెటర్‌ అన్న విషయం మార్చిపోయి ఇలా వ్యవహరించడం తగదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

కుటుంబం జోలికి వస్తే ఊరుకోను

అభిమానితో గొడవ జరిగిన ఘటనపై హారిస్‌ రవూఫ్‌ స్పందించాడు. ‘‘ఈ విషయం సోషల్ మీడియా వరకు రావొద్దని అనుకున్నా. కానీ, ఎలాగో వీడియో బయటకు రావడంతో స్పందించక తప్పడం లేదు. క్రీడాకారులుగా ఉన్నందున ప్రజల నుంచి అన్ని రకాల ఫీడ్ బ్యాక్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. వారే కొన్నిసార్లు మమ్మల్ని సమర్థిస్తారు. ఒక్కోసారి విమర్శిస్తారు కూడా. కానీ, హద్దులు దాటి నా తల్లిదండ్రులు, కుటుంబం జోలికి వస్తే వారికి తగ్గట్లుగా బదులిస్తాను. ప్రొఫెషన్స్‌కు అతీతంగా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మనం గౌరవించాల్సి ఉంటుంది’’ అని రవూఫ్‌ ఎక్స్‌ (ట్విటర్)లో రాసుకొచ్చాడు.

రవూఫ్‌కు ఛైర్మన్‌ బాసట

‘‘హారిస్ రవూఫ్‌కు సంబంధించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. మా ఆటగాళ్లపై ఇటువంటి చర్యలు పూర్తిగా ఆమోదయోగ్యం కావు. ఇలాంటి వాటిని మేం సహించబోము. ఈ విషయంతో ప్రమేయం ఉన్నవారు వెంటనే హారిస్ రవూఫ్‌కి క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహసీన్‌ నక్వీ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని