T20 World Cup: ‘ఇది కదా అసలైన గురుదక్షిణ’.. టీమ్‌ఇండియా విజయంపై ఆనంద్‌ మహీంద్రా

టీ20 వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకున్న సందర్భంగా భారత జట్టును ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ప్రశంసించారు. 

Published : 30 Jun 2024 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup)ను భారత్‌ సొంతం చేసుకోవడంతో దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుపై ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) జట్టు కృషిని కొనియాడారు.

‘‘క్రికెట్‌, జీవితానిది ఒకటే స్టోరీ. గురువు ఆశీస్సులతోనే ప్రపంచాన్ని గెలవచ్చు. గురు పూర్ణిమ రావడానికి ముందే జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు టీమిండియా మరువలేని గురుదక్షిణను ఇచ్చింది’’ అని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఆనంద్‌ మహీంద్రా ప్రశంసించారు. టీమ్ఇండియా గెలవడంతో భారత్‌లోని జపాన్‌ రాయబారి హిరోషి సుజుకి కూడా సంబరాలు చేసుకున్నారు. ‘‘భారత్‌ జట్టు కృషి ఫలించింది. ఈ విజయంతో ఎట్టకేలకు 17 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది. మీ అందరికి నా అభినందనలు’’ అని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

ఆ క్యాచ్‌ అద్భుతం.. 

భారత్‌ జట్టు విజయంపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత, బీసీసీఐ మాజీ చీఫ్‌ శరద్‌ పవార్‌ (Sharad Pawar) హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈ విజయంతో క్రికెట్‌ ప్రపంచంలో భారత్‌ ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకొంది. సూర్యకుమార్‌ యాదవ్‌ క్యాచ్‌ అద్భుతం. బుమ్రా బౌలింగ్‌ మరవలేనిది. కోచ్‌గా వ్యవహరించిన రాహుల్‌ ద్రవిడ్‌ ఆటగాళ్లకు మంచి మార్గదర్శకత్వం చూపారు. టీమ్‌ఇండియాకు నా అభినందనలు’’ అని పేర్కొన్నారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలపై ఆయన ప్రశంసలు కురిపించారు. సరైన సమయంలో వారిద్దరూ తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. క్రికెట్‌కు వారు చేసిన కృషిని కొనియాడారు.

ఇదెంతో ప్రత్యేకం.. గత ఆరు నెలలు ఎలా ఉన్నాయో తెలుసు: హార్దిక్

‘‘టీ20 వరల్డ్‌ కప్‌ను భారత్‌కు అందించిన జట్టును ప్రశంసించడానికి మాటలు సరిపోవడం లేదు. చాలా ఏళ్ల తర్వాత దేశ ప్రజలకు టీమ్‌ఇండియా ఇచ్చిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. రోహిత్‌ శర్మ సారథ్యంలో భారత్‌ విశ్వ విజేతగా నిలిచింది. ఈ విజయం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. భారత జట్టును హృదయపూర్వకంగా అభినందిస్తున్నా’’ అని ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ టీమ్ఇండియా సాధించిన విజయాన్ని కొనియాడారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు