SA vs AFG: ఎవరు గెలిచినా ఫస్ట్ టైమ్‌.. మరో సంచలనం చూస్తామా?

సంచలనాలకు వేదికగా టీ20 ప్రపంచ కప్‌ నిలిచింది. ఇప్పటి వరకు నాకౌట్‌ దశకు చేరుకోని అఫ్గాన్‌ తొలిసారి మెగా టోర్నీలో దూసుకొచ్చింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది.

Published : 26 Jun 2024 17:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సంచలన ప్రదర్శనతో హేమాహేమీలను కాదని అఫ్గానిస్థాన్‌ తొలిసారి సెమీస్‌కు చేరింది. మరోవైపు దూకుడైన ఆటతీరుతో నాకౌట్‌కు వచ్చిన జట్టు దక్షిణాఫ్రికా. రెండు టీమ్‌ల మధ్య టీ20 ప్రపంచ కప్‌ తొలి సెమీస్ జరగనుంది. ఇందుకు వేదిక ట్రినిడాడ్. బలాలను బేరీజు వేసుకుంటే సౌతాఫ్రికాదే ఆధిపత్యం. కానీ, అఫ్గాన్‌ను తక్కువ అంచనా వేస్తే ఏమవుతుందో ఇప్పటికే నిరూపణ అయింది. 

ఎవరు కీలకం..?

  • దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య  గురువారం ఉదయం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం) తొలి సెమీస్‌ ప్రారంభం కానుంది. ట్రినిడాడ్ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. 
  • ఇప్పటి వరకు ఇరు జట్లూ టీ20ల్లో రెండుసార్లు మాత్రమే తలపడ్డాయి. అన్నింట్లోనూ దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. ఇప్పుడు తొలి గెలుపుపై అఫ్గాన్‌ కన్నేసింది. 
  • టీ20 ప్రపంచ కప్‌ 2024 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అఫ్గాన్‌ ఆటగాడు రహ్మనుల్లా గుర్బాజ్ (281) ముందున్నాడు. ఇబ్రహీం జద్రాన్ (229) కూడా మూడో స్థానంలో నిలిచాడు. 
  • ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌ కూడా అఫ్గాన్‌కు చెందిన వారే కావడం గమనార్హం. ఫరూఖి 16 వికెట్లు ముందున్నాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ (14), నవీనుల్ హక్ (13) ప్రభావం చూపించారు. 
  • లీగ్‌స్టేజ్‌, సూపర్‌-8 పోరులో దక్షిణాఫ్రికా అజేయంగా నిలిచి సెమీస్‌కు దూసుకొచ్చింది. ఆ జట్టులో కెప్టెన్ మార్‌క్రమ్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, డికాక్ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో రబాడ, షంసీ, ఎన్‌సెన్, కేశవ్ మహరాజ్, బార్ట్‌మన్ అదరగొట్టేస్తున్నారు. 
  • అఫ్గాన్‌ మాత్రం సంచలన విజయాలు సాధించింది. న్యూజిలాండ్, ఆసీస్‌ను చిత్తు చేసి మొదటి సారి నాకౌట్‌కు చేరింది. గుర్బాజ్, జద్రాన్, ఒమర్జాయ్, గుల్బాదిన్ నైబ్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తున్నారు. రషీద్ ఖాన్, నూర్, నవీనుల్, ఫరూఖి దెబ్బకు ప్రత్యర్థి బ్యాటర్లు హడలెత్తిపోతున్నారు.
  • దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్‌ జట్లలో ఎవరు సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు చేరినా.. వారికిదే మొదటిది కావడం విశేషం. ఇప్పటి వరకు ఇరు జట్లూ పొట్టి కప్‌లో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. 
  • ట్రినిడాడ్ పిచ్ మందకొడిగా ఉంటుంది.  భారీ స్కోర్లు సాధించడం చాలా కష్టం. స్పిన్నర్లకు సహకారం లభిస్తుందని అంచనా. ఈ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌ యావరేజ్‌ స్కోరు 135. రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులుగా ఉంది. 
  • మ్యాచ్‌కు వర్షం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఒకవేళ వరుణుడు మ్యాచ్‌ను అడ్డుకుంటే మాత్రం అఫ్గాన్‌కు చుక్కెదురైనట్లే. మ్యాచ్‌ రద్దైతే దక్షిణాఫ్రికా నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. సూపర్-8 స్టేజ్‌లో అగ్రస్థానంలో ఉండటమే దానికి కారణం. 
  • టాస్‌ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. మంచి స్కోరును లక్ష్యంగా నిర్దేశిస్తే.. ప్రత్యర్థిపై ఒత్తిడి తేవడం ఈజీ అవుతుందని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. అఫ్గాన్‌ తన నాలుగు మ్యాచ్‌లను ఇలానే గెలిచింది. 

తుది జట్లు (అంచనా)

దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఐదెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్‌, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో ఎన్‌సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, నోకియా, షంసీ

అఫ్గానిస్థాన్‌: రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్  కీపర్), రషీద్ ఖాన్ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నైబ్, నబీ, కరీమ్ జనత్, ఖరోటె, నూర్ అహ్మద్, నవీనుల్ హక్, ఫరూఖి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని