Afghanistan - Kenya: చిన్న జట్టు పెద్ద ఆట... అప్పుడు కెన్యా.. ఇప్పుడు అఫ్గాన్‌

టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కి చేరి అఫ్గానిస్థాన్‌ అద్భుతం సృష్టించింది. గతంలో కెన్యా కూడా ఇలానే సంచలనం సృష్టించింది. 

Published : 27 Jun 2024 00:14 IST

క్రికెట్‌ ప్రపంచకప్‌ అంటే పెద్ద జట్లే ముందంజ వేస్తాయని అభిమానులు ఊహిస్తారు. పసి కూనలు పోటీలో ఉన్నా అవి కేవలం లీగ్‌ దశ వరకే అనుకుంటారు. ఆ జట్లు ఒక్క మ్యాచ్‌ గెలిచినా ఆశ్చర్యపోతారు. అలాంటిది ఒక్క మ్యాచ్‌ గెలవడం కాదు ఏకంగా సెమీఫైనల్‌ చేరితే! నిజంగా అద్భుతమే. టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)లో అఫ్గానిస్థాన్‌ (Afghanistan Cricket) ఈ అద్భుతమే చేసింది. పోటీలో ఎన్నో బలమైన జట్లు ఉన్నా అన్నింటిని తోసిరాజని టాప్‌-4లో స్థానాన్ని దక్కించుకుంది. రికార్డు స్థాయిలో 20 జట్లు పోటీపడిన ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో నిలిచి ఔరా అనిపించింది. 2003 వన్డే ప్రపంచకప్‌లో పసికూన కెన్యా (Kenya Cricket) జట్టు సెమీఫైనల్‌ చేరిన వైనాన్ని గుర్తుకు తెచ్చింది అఫ్గాన్‌.

కెన్యా అలా..

ప్రపంచకప్‌లో ఆడడమే కెన్యా లాంటి జట్టుకు గొప్ప. అలాంటిది ఏకంగా సెమీఫైనల్‌ చేరితే నిజంగా చాలా గొప్ప విషయం. కానీ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అదరగొట్టిన ఈ జట్టు 2003 వన్డే ప్రపంచకప్‌లో తుది నాలుగు జట్ల జాబితాలో చోటు దక్కించుకుని సంచలనం సృష్టించింది. వన్డేల్లో కెన్యా ఇలాంటి ప్రతిభ చూపించడం అసామాన్యం. లీగ్‌ దశలో  6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి కెన్యా ముందంజ వేసింది. ఈ క్రమంలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లను కూడా ఆ జట్టు ఓడించింది. 

భద్రత కారణాలతో న్యూజిలాండ్‌ వాకోవర్‌ ఇవ్వడం ఆ జట్టుకు కలిసొచ్చింది. సూపర్‌-6లోనూ ఈ జట్టు ప్రతిభ చూపించింది. అప్పట్లో మెరుగైన జట్టుగా ఉండే జింబాబ్వేకు కూడా షాక్‌ ఇచ్చింది. అదే జోరుతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లి టాప్‌ జట్టు భారత్‌ను ఢీకొంది. సెమీస్‌లో ఒక దశలో టీమ్‌ఇండియాను ఇబ్బంది కూడా పెట్టింది. కెప్టెన్‌ గంగూలీ సెంచరీతో ఆదుకోవడంతో టీమ్‌ఇండియా మెరుగైన స్కోరు చేసింది. ఛేదనలో కెన్యా పోరాడినా ఫలితం లేకపోయింది. కెన్యా ఓడినా చిన్న జట్లకు పెద్ద స్ఫూర్తిగా నిలిచింది. 

అఫ్గాన్‌ ఇలా..

కెన్యాతో పోలిస్తే అఫ్గాన్‌ బలమైన జట్టే. కానీ ఆ రషీద్‌ ఖాన్‌ సారథ్యంలోని ఆ జట్టుకు 2024 టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 వరకు వస్తుందని కూడా అనుకోలేదు. అలాంటిది సూపర్‌-8కు రావడమే కాదు పెద్ద జట్లను కంగుతినిపించి ఏకంగా సెమీఫైనల్లో స్థానాన్ని దక్కించుకుంది. లీగ్‌ దశలో న్యూజిలాండ్‌ను ఓడించడం దగ్గర నుంచి మొదలైంది ఆ జట్టు జైత్రయాత్ర. కెప్టెన్‌ రషీద్‌ కెప్టెన్సీతో పాటు అటు బంతితోనూ అదగొట్టి టోర్నీలో తొలి సంచలనానికి కారణమయ్యాడు. న్యూజిలాండ్‌ కేవలం 75కే కుప్పకూలింది. అఫ్గాన్‌ ఏదో గాలివాటంగా పెద్ద జట్టును ఓడించింది అనుకుంటే.. ఆ జట్టు మున్ముందు ఇంకా రెచ్చిపోయింది. 

సూపర్‌-8లో ఆస్ట్రేలియా లాంటి స్టార్‌ జట్టును కంగుతినిపించి ప్రకంపనలు రేపింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై పైచేయి సాధించి.. తాను తొలిసారి సెమీస్‌ చేరడమే కాదు.. ఆసీస్‌ను ఇంటికి పంపించింది. సెమీస్‌ చేరే క్రమంలో అఫ్గాన్‌ అద్భుతాలేమి చేయలేదు. పట్టుదలగా ఆడింది. చివరిదాకా పోరాడింది. భారీ స్కోర్లు చేయకపోయినా.. కలిసికట్టుగా ప్రత్యర్థులను బంతితో చుట్టేసింది. ముఖ్యంగా బంగ్లాతో క్వార్టర్‌ఫైనల్‌ లాంటి మ్యాచ్‌లో తెలివిగా ఆడి ప్రత్యర్థికి పంచ్‌ ఇచ్చింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో పోటీకి సిద్ధమైన అఫ్గాన్‌ మరో సంచలనం సృష్టించే అవకాశాన్నీ కొట్టి పారేయలేం. అదే జరిగితే అఫ్గాన్‌ ఏమాత్రం ఇక చిన్న జట్టు కాదు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని