T20 World Cup: తొలి ఫైనల్‌ ఎవరిదో...

టీ20 ప్రపంచకప్‌లో రసవత్తర సమరానికి వేళైంది. సంచలన ప్రదర్శనతో క్రికెట్‌ పండితులను ఆశ్చర్యపరిచిన అఫ్గానిస్థాన్‌ గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో డార్క్‌హార్స్‌ దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది.

Published : 27 Jun 2024 01:53 IST

అఫ్గాన్‌ × దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌ నేడే
ఉదయం 6 నుంచి

తరౌబా (ట్రినిడాడ్‌): టీ20 ప్రపంచకప్‌లో రసవత్తర సమరానికి వేళైంది. సంచలన ప్రదర్శనతో క్రికెట్‌ పండితులను ఆశ్చర్యపరిచిన అఫ్గానిస్థాన్‌ గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో డార్క్‌హార్స్‌ దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గినా చరిత్రే అవుతుంది. ఎందుకంటే అఫ్గానే కాదు.. దక్షిణాఫ్రికా కూడా ఇప్పటివరకు ఏ ఫార్మాట్లోనూ ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరలేదు. అనుభవం తక్కువే అయినా అఫ్గానిస్థాన్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. సెమీఫైనల్‌ చేరే క్రమంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి మేటి జట్లకు షాకిచ్చిన ఆ జట్టు.. రెట్టించిన విశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. ఆ జట్టులో ఎందరో హీరోలు. కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ టోర్నీ ఆరంభం నుంచి విశేషంగా రాణిస్తున్నాడు. పేసర్లు ఫారూఖీ, నవీనుల్‌ హక్‌ కీలక సమయాల్లో వికెట్లను అందిస్తున్నారు. ఆసీస్‌పై నైబ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఇక బ్యాటుతో అదరగొడుతున్న గుర్బాజ్‌ (281).. మరోసారి చెలరేగాలని అఫ్గాన్‌ కోరుకుంటోంది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో గుర్బాజ్‌ అగ్రస్థానంలో ఉంటే.. బౌలర్ల జాబితాలో ఫారూఖీ (16) ముందున్నాడు. అయితే ఫామ్‌లో ఉన్నప్పటికీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ ఆడిన అనుభవం లేని అఫ్గాన్‌.. ఒత్తిడికి గురికాకుండా ఉండడం ముఖ్యం. మరోవైపు దక్షిణాఫ్రికా ఈసారైనా సెమీఫైనల్‌ దాటాలనే పట్టుదలతో ఉంది. ప్రపంచకప్‌లో కీలక సమయాల్లో ఒత్తిడి గురయ్యే బలహీనతను అధిగమిస్తూ ఈ టోర్నీలో విజయాలు సాధించడం ఆ జట్టు విశ్వాసాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. డికాక్, హెండ్రిక్స్, క్లాసెన్, మిల్లర్, మార్‌క్రమ్‌లతో బ్యాటింగ్‌లో.. నోకియా, రబాడ, కేశవ్‌ మహరాజ్, షంసి వంటి వారితో బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా బలంగానే ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని