Rohit Sharma: రోహిత్‌ ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో.. వారి నోళ్లు మూయించాడు: గిల్‌క్రిస్ట్‌

గత వన్డే ప్రపంచ కప్‌లో ఓటమికి ఈసారి ఆసీస్‌పై విజయంతో భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

Published : 26 Jun 2024 13:25 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) భారత్ సెమీస్‌కు చేరుకుంది. సూపర్‌-8 పోరులో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమ్ఇండియా అగ్రస్థానం సాధించి మరీ నాకౌట్‌కు వెళ్లింది. అప్పటి వరకు భారీ ఇన్నింగ్స్‌లు ఆడని కెప్టెన్ రోహిత్‌ ఆసీస్‌పై మాత్రం విరుచుకుపడ్డాడు. ఓ వైపు విరాట్ కోహ్లీ (0) డకౌట్‌ అయినా సరే.. కంగారూ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు చేసి ఔటయ్యాడు. కమిన్స్, హేజిల్‌వుడ్, స్టార్క్‌ వంటి బౌలర్లపై  దూకుడుగా ఆడటం అభినందనీయమని ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ తెలిపాడు. ఇలాంటి ఆటతీరుతో చాలామంది నోళ్లు మూయించాడని వ్యాఖ్యానించాడు. 

‘‘రోహిత్ శర్మ (Rohit Sharma) చాలా అద్భుతంగా ఆడాడు. దూకుడు కొనసాగిస్తామని బయట చెప్పిన మాటలను... మైదానంలో చేసి చూపించాడు.  యువ క్రికెటర్లకు ఎంతో స్ఫూర్తిగా నిలిచాడు. ఐపీఎల్‌ గణాంకాలను చూసి చాలామంది వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాటన్నింటికీ సమాధానం ఇచ్చినట్లైంది. జట్టులో తన విలువేంటో చాటిచెప్పాడు. బౌలర్లపై ఎప్పుడు ఆధిపత్యం ప్రదర్శించాలో బాగా తెలిసిన క్రికెటర్. కెప్టెన్‌ ముందుండి ఇలాంటి ఆటతీరును ప్రదర్శిస్తే.. జట్టులోని మిగతా సహచరులూ స్ఫూర్తి పొందుతారు. మ్యాచ్‌ సమయంలో చాలామంది కెప్టెన్లు ‘ఫలితాల గురించి ఆలోచించం.. ఆడే విధానంపై దృష్టిపెడతాం’ అంటుంటారు. ఇక్కడ రోహిత్ మాత్రం దూకుడుగానే తన ఇన్నింగ్స్‌ ఉంటుందని చెప్పకనే చెప్పాడు’’ అని గిల్‌క్రిస్ట్‌ తెలిపాడు. 

ఇలా జరిగితే.. ఆ జట్టుదే వరల్డ్‌ కప్: హాగ్

టీ20 ప్రపంచకప్‌లో భారత్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ సెమీస్‌కు చేరాయి. తొలి సెమీస్‌ దక్షిణాఫ్రికా-అఫ్గాన్‌ (SA vs AFG)ల మధ్య గురువారం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ అదేరోజు రాత్రి 8 గంటలకు భారత్-ఇంగ్లాండ్ (IND vs ENG)మధ్య జరగనుంది. అయితే, అఫ్గాన్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించి ఫైనల్‌కు చేరితే మాత్రం ఆ జట్టే టైటిల్‌ సొంతం చేసుకుంటుందని మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ వ్యాఖ్యానించాడు. ‘‘దక్షిణాఫ్రికా జట్టులో హెండ్రిక్స్‌, క్లాసెన్, డికాక్‌, మిల్లర్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ట్రిస్టన్ స్టబ్స్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌తో రాణిస్తున్నాడు. బౌలర్లలో షంసీను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు చాలా కష్టం. అతడికి తోడుగా కేశవ్ మహరాజ్‌ ఉన్నాడు. ఇక పేస్‌ అద్భుతంగా ఉంది’’ అని బ్రాడ్ హాగ్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని