t20 World Cup 2024: ఎందుకింత ఉద్వేగం!

దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఐసీసీ టోర్నీల్లో వరుస పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఎంతగా ప్రయత్నించినా.. ఎలా ఆడినా కప్‌ మాత్రం దక్కడం లేదు. సెమీస్‌లోనే నిష్క్రమణ లేదా ఫైనల్లో బోల్తా. చివరగా 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీలో విజయం.

Updated : 01 Jul 2024 06:42 IST

దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఐసీసీ టోర్నీల్లో వరుస పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఎంతగా ప్రయత్నించినా.. ఎలా ఆడినా కప్‌ మాత్రం దక్కడం లేదు. సెమీస్‌లోనే నిష్క్రమణ లేదా ఫైనల్లో బోల్తా. చివరగా 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీలో విజయం. ఆ తర్వాత 10 ఐసీసీ టోర్నీల్లో నిరాశే. గతేడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌ను కచ్చితంగా గెలిచేలా కనిపించినా.. చివరకు తుదిపోరులో ఓటమి. దీంతో భారత అభిమానుల్లో  ఒక రకమైన నిర్వేదం. మరో కప్‌ గెలవలేమా? అనే వేదన. 

ఈ సారి టీ20 ప్రపంచకప్‌లోనూ ఫైనల్లో ఓ దశలో పరాజయం పలకరించేలా కనిపించింది. మరోసారి కన్నీళ్లే మిగులుతాయా అనిపించింది. కానీ చివరకు కన్నీళ్లే వచ్చాయి. కానీ అవి ఓటమి తెచ్చినవి కావు. విజయం ఇచ్చినవి. ఏళ్ల తరబడి జట్టు పోరాటానికి ఫలితం దక్కగానే.. మరోసారి భారత్‌ విశ్వవిజేతగా నిలవగానే.. మనసులు కరిగి కన్నీరుగా మారాయి. అటు మైదానంలోని ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బందే కాదు ఇటు దేశంలోని ప్రతి అభిమాని హృదయం కదిలింది. శనివారం రాత్రి దేశమంతా భావోద్వేగంతో నిండిపోయింది.

ఈనాడు క్రీడావిభాగం

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో చివరి ఓవర్‌ పూర్తి చేయగానే హార్దిక్‌ పాండ్య కళ్లలో నీరు.. మైదానాన్ని హత్తుకున్న రోహిత్‌ శర్మ కళ్లలో నీరు.. నేలపై కూలబడిన బుమ్రా కళ్లలో నీరు.. ఆకాశానికి చేతులు చాచిన కోహ్లి కళ్లలో నీరు.. సాధించామని సగర్వంగా తలెత్తుకున్న కోచ్‌ ద్రవిడ్‌ కళ్లలో నీరు. అది చూసి.. టీమ్‌ఇండియా సాధించిన విజయాన్ని చూసి.. దేశంలోని కోట్లాది అభిమానులు ఉద్వేగానికి గురయ్యారు. ఉద్విగ్న వాతావరణంలో సంబరాలు చేసుకున్నారు. ఇది భారత క్రికెట్‌ జట్టు చూడని గెలుపేం కాదు. అప్పటికే 1983, 2011 వన్డే.. 2007 టీ20 ప్రపంచకప్‌లను జట్టు గెలిచింది. కోహ్లి (2011), రోహిత్‌ (2007) కూడా గతంలోనే ప్రపంచకప్‌ నెగ్గిన జట్లలో ఉన్నారు. కానీ ఈ టైటిల్‌ సాధించగానే వీళ్లు అమితమైన భావోద్వేగానికి లోనయ్యారు. ఐసీసీ టోర్నీల్లో వరుస పరాభవాల తర్వాత దక్కిన ఈ గెలుపు ప్రత్యేకంగా మారింది. అసాధ్యమనుకున్నది అందుకోగానే అందరూ సంతోషంలో తేలిపోయారు. దక్షిణాఫ్రికాపై విజయం కంటే కూడా అది సాధించిన తీరు ఈ టైటిల్‌కు మరింత విలువను పెంచింది. తీవ్రమైన బాధ కలిగినప్పుడు లేదా అంతులేని ఆనందం ఆవహించినప్పుడు అప్రయత్నంగానే కళ్లలో నీళ్లు వస్తాయి. మాటల్లో చెప్పలేని అనుభూతికి ఈ కన్నీరే మౌన సాక్ష్యమవుతుంది. టీమ్‌ఇండియా విజయం తర్వాత జరిగిందదే.

నంబర్‌వన్‌ అయినా..

భారత్‌ వన్డేల్లో చివరగా 2011లో ప్రపంచకప్‌ గెలిచింది. టీ20ల్లో అయితే మొట్టమొదటి సారి 2007లో నిర్వహించిన కప్‌ను ముద్దాడింది. ఆఖరిగా 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ టైటిల్‌ నెగ్గింది. అక్కడి నుంచి 2024కు ముందు వరకు టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి 10 ఐసీసీ టోర్నీలు ఆడింది. కానీ ఒక్కదాంట్లోనూ విజేతగా నిలవలేకపోయింది. 2021, 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో ఓడింది. వన్డే ప్రపంచకప్‌ల్లో 2015, 2019లో సెమీస్‌లో.. 2023లో తుదిపోరులో నిష్క్రమించింది. టీ20ల్లో అయితే 2014లో రన్నరప్‌గా నిలిచిన జట్టు.. ఆ తర్వాత వరుసగా 2016లో సెమీస్, 2021లో సూపర్‌-12, 2022లో సెమీస్‌ ప్రదర్శన చేసింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో రన్నరప్‌గా మిగిలింది. ఇలా ఐసీసీ కప్‌ గెలవడంలో వరుసగా విఫలమైనంత మాత్రాన మన జట్టు బలహీనమేమీ కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ప్రపంచ క్రికెట్లోనే బలమైన జట్టుగా టీమ్‌ఇండియాకు పేరుంది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మన రికార్డుకు తిరుగేలేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా లాంటి జట్లపై స్వదేశంలో సిరీస్‌ విజయాలను భారత్‌ సాధించింది. ఆయా దేశాల్లోనూ రికార్డు విజయాలు నమోదు చేసింది. మూడు ఫార్మాట్లలోనూ నంబర్‌వన్‌గా ఎదిగింది. కానీ ఐసీసీ టోర్నీల్లో మాత్రం కీలక దశలో ఒత్తిడికి చిత్తయి నిష్క్రమించేది. అయితే ఈ సారి ఆ కథను జట్టు మార్చింది. క్రికెట్‌ను పిచ్చిగా ప్రేమించే దేశానికి.. తమ కోసం స్టేడియాలకు ఎగబడే జనాలకు.. అద్భుతమైన బహుమతిని అందించింది. వరుస వైఫల్యాలతో నిరాశలో మునిగిపోయిన అభిమానులకు అదిరిపోయే కిక్కునిచ్చింది. దీంతో దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి.

వెస్టిండీస్‌ అంటేనే..

ప్రపంచకప్‌ వేదికగా వెస్టిండీస్‌ అంటేనే భారత్‌కు కలిసిరాదనే పేరుండేది. అక్కడ జరిగిన 2007 వన్డే ప్రపంచప్‌లోనూ ద్రవిడ్‌ సారథ్యంలోని భారత్‌ గ్రూప్‌ దశలోనే అవమానకర రీతిలో నిష్క్రమించింది. ఇక 2010లో కరీబియన్‌ గడ్డపై నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సూపర్‌-8 దశలోనే వెనుదిరిగింది. ఈ సారి అమెరికాతో కలిసి వెస్టిండీస్‌ ఉమ్మడి ఆతిథ్య దేశంగా ఉండటం.. సూపర్‌-8 నుంచి రోహిత్‌ సేన అక్కడే మ్యాచ్‌లు ఆడాల్సి రావడంతో కాస్త కంగారు తప్పలేదు. కానీ మన జట్టు చరిత్ర తిరగరాసింది. ఎక్కడైతే జట్టుకు కలిసి రాదనే అభిప్రాయం ఉందో అక్కడే విజేతగా నిలిచి త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాక్కున్న తీరు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. కష్ట కాలంలో జట్టును ఆదుకున్న కోహ్లి ఇన్నింగ్స్, ప్రమాదకర క్లాసెన్‌ను ఔట్‌ చేసిన హార్దిక్‌ బంతి, 18వ ఓవర్లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్, ఆఖరి ఓవర్లో బౌండరీ లైన్‌ దగ్గర సూర్యకుమార్‌ సూపర్‌ క్యాచ్‌.. ఇలా ఏ ఒక్కటి లేకున్నా ఈ విజయం దక్కేది కాదు. శనివారం రాత్రి టీవీల్లో, ఫోన్లలో ప్రత్యక్షంగా మ్యాచ్‌ వీక్షించిన అభిమానులు అనిర్వచనీయమైన అనూభూతిని పొందారు. మళ్లీ మళ్లీ ఆ మ్యాచ్‌ హైలైట్స్, విజయం సాధించిన క్షణాలు, జట్టు సంబరాలు, ఆటగాళ్ల కన్నీళ్లను చూస్తుంటే జనాల్లో ఒక రకమైన భావన కలుగుతోందంటే అతిశయోక్తి కాదు.

చెరగని సంతకం

ఈ ప్రపంచకప్‌తోనే టీ20ల్లో రోహిత్, కోహ్లి దిగ్గజ ప్రస్థానం ముగిసింది. చాలా ఏళ్లుగా భారత క్రికెట్‌కు మూల స్తంభాల్లా ఉన్న ఈ ఇద్దరు కలిసి ప్రపంచకప్‌ అందుకోవడంతో దీనికి మరింత ప్రత్యేకత వచ్చింది. కానీ ఈ కప్‌ దిశగా వీళ్ల ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవు అంటారు. కానీ కోహ్లి, రోహిత్‌ ఒకే జట్టు కోసం ఒకటిగా కలిసిపోయిన ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు. కోహ్లి కంటే రెండేళ్లు పెద్దవాడైన రోహిత్‌.. అతని కంటే ఓ ఏడాది ముందే అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చాడు. కానీ కోహ్లి అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శనతో దూసుకెళ్లాడు. రోహిత్‌ పరిమిత ఓవర్లలో సత్తాచాటినా టెస్టుల్లో మొదట అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో కోహ్లి ముందుగా జట్టు కెప్టెన్‌ అయ్యాడు. కానీ 2021 టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి కప్‌ ఫార్మాట్‌ కెప్టెన్సీని కోహ్లి వదిలేశాడు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టుకు ఒకరే కెప్టెన్‌గా ఉండాలని వన్డేల నుంచి కూడా కోహ్లీని కెప్టెన్‌గా తప్పించి, రోహిత్‌కే ఆ బాధ్యతలు కట్టబెట్టారు. ఆ తర్వాత టెస్టు కెప్టెన్సీ కూడా రోహిత్‌కే దక్కింది. దీంతో రోహిత్, కోహ్లి మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలొచ్చాయి. ఈ వివాదం కోహ్లి బ్యాటింగ్‌పైనా ప్రభావం చూపింది. కానీ ఈ ఇద్దరూ కలిసే సాగారు. జట్టు కోసం అహాన్ని దూరం పెట్టి ఒక్కటయ్యారు. గతంలో ధోని సారథ్యంలో సచిన్‌ ఆడినట్లు.. ఇప్పుడు రోహిత్‌ నాయకత్వంలో కోహ్లి సాగిపోయాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడ్డ కోహ్లీని రోహిత్‌ ఎప్పుడూ వెనకేసుకొచ్చాడు. ఫామ్‌ లేమి నుంచి బయటపడేలా అండగా నిలిచాడు. కోహ్లి కూడా ఎప్పటికప్పుడూ రోహిత్‌ పట్ల సానుకూల వైఖరితోనే సాగాడు. 2022 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించగానే రోహిత్‌ వెళ్లి అతణ్ని పైకెత్తడం వీళ్ల మధ్య ఉన్న స్నేహాన్ని చాటింది. ఈ ప్రపంచకప్‌లోనూ ఫైనల్‌కు ముందు కోహ్లి విఫలమైతే.. అతనో స్టార్‌ ఆటగాడని, తుదిపోరులో సత్తాచాటుతాడని రోహిత్‌ అన్నాడు. తన నమ్మకాన్ని కోహ్లి నిలబెట్టాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ కప్‌ గెలిచి ఒక్కసారే టీ20లకు గుడ్‌బై చెప్పారు. టీ20 జట్టుపై వీరి ముద్ర బలమైంది. ఇప్పుడు వీరు ఖాళీ చేసిన స్థానాలను భర్తీ చేయడం అంత తేలిక కాదు. ఎంత గొప్ప ఆటగాళ్లైనా.. జట్టు తర్వాతే ఎవరైనా అని, ఏం చేసినా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని వీళ్లిద్దరూ తమ ఆటతో, వ్యక్తిత్వంతో చాటి చెప్పారు. యువ ఆటగాళ్లు వీరి నుంచి పాఠాలు నేర్చుకుని వారి ఘనవారసత్వాన్ని కొనసాగిస్తారని ఆశిద్దాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని