Indian T20: రోహిత్‌ తర్వాత ఎవరు..?

టీమ్‌ ఇండియాలో కెప్టెన్‌ స్థానం ఖాళీ అయింది. రోహిత్‌ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. 

Updated : 01 Jul 2024 13:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ ఇండియా టీ20 (Team India T20) ప్రపంచకప్‌ ఫైనల్‌లో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. అదే సమయంలో సారథి రోహిత్‌ సైలెంట్‌గా ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. హిట్‌మ్యాన్‌ ఫోకస్‌ ఇప్పుడు ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఉంది. ఇక టీ20పై కొత్తవారు దృష్టి పెట్టి వారసత్వాన్ని అందుకోవాలని భావించాడు. వాస్తవానికి హిట్‌మ్యాన్‌ టీమ్ ఇండియాకు ఈ ఫార్మాట్‌లో కొత్త ప్రమాణాలు సృష్టించాడు. అతడి వారసుడు ఇప్పుడు వాటిని కచ్చితంగా ముందుకుతీసుకెళ్లగలిగే స్థాయిలో ఉండాల్సిందే. భారత్‌ పొట్టిఫార్మాట్‌లో దాదాపు దుర్భేద్యమైన జట్టుగా మారింది. ఈనేపథ్యంలో జట్టు పగ్గాలను బీసీసీఐ, సెలక్టర్లు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది. ఈ రేసులో పలువురు స్టార్లు ఉన్నారు. 

వైస్‌ కెప్టెన్‌ ముందంజ.. 

ఈ రేసులో ప్రస్తుత జట్టు వైస్‌కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ముందంజలో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో అతడి ఆటతీరు ఫ్యాన్స్‌ను ఖుష్‌ చేసింది. ముఖ్యంగా ఫైనల్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తానే ముందుండి ఎదురుదాడికి దిగాడు. ఎంతో రిస్క్‌తో కూడిన చివరి ఓవర్‌ బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసి.. తాను ఎంతటి ఒత్తిడినైనా తట్టుకొని నిలబడతానని ప్రపంచానికి చెప్పాడు. 

ఈ ఫార్మాట్‌లో 2022 ఐపీఎల్‌ను గుజరాత్‌ టైటాన్స్‌కు సాధించిన అనుభవం పాండ్యాకు ఉంది. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. వాస్తవానికి 2022 టీ20 కప్పులో భారత్‌ ఓడిపోయిన తర్వాత న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ జరిగింది. దానికి పాండ్యానే నాయకత్వం వహించి గెలిపించాడు. ఆ తర్వాత శ్రీలంకపై (3-0), స్వదేశంలో కీవిస్‌పై (2-1) సిరీస్‌ల్లో విజయపథంలో నడిపించాడు. గతేడాది చివరిసారిగా వెస్టిండీస్‌లో జరిగిన ద్వైపాక్షిక టోర్నీని 3-2 తేడాతో ఓడిపోయాడు.

జట్టుకు హార్దిక్‌పాండ్య స్థాయి సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఇప్పటివరకు లభించలేదు. దీంతో అతడి పాత్ర కీలకంగా మారింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌పై పట్టు ఉండటం అతడికి కలిసొచ్చే అంశం. కాకపోతే, తరచూ గాయాలపాలవుతాడనే అపవాది ఉంది. కొన్ని సీజన్లలో తన కోటా ఓవర్లు కూడా పూర్తి చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నాడు. దీంతోపాటు వన్డేల్లో కూడా అతడు ఆల్‌రౌండర్‌ పాత్ర పోషించాల్సి ఉంటుంది.

సూర్యకు బ్యాటింగే బలం.. 

మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా నాయకత్వ రేసులో ఉన్నాడు. పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని ఆటగాడు. తాను ఐదు ఓవర్లు క్రీజులో ఉంటే చాలు.. ఏ జట్టు నుంచైనా విజయాన్ని లాగేసుకొంటాడు. ఇటీవల కాలంలో భారత జట్టులో దూకుడు బ్యాటింగ్‌ పెరగడంలో సూర్య ప్రభావం ఉంది. ఇటీవల ఆస్ట్రేలియా జట్టు భారత్‌ పర్యటించిన వేళ టీమ్‌ ఇండియాకు నాయకత్వం వహించాడు. మొత్తం ఏడు మ్యాచ్‌లకు నాయకత్వం వహించి ఐదు గెలిపించాడు. తన చివరి మ్యాచ్‌ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికాపై 56 బంతుల్లో శతకం చేశాడు. అదే మ్యాచ్‌ను 106 పరుగుల తేడాతో విజయం సాధించాడు. 

బౌలింగ్‌ జీనియస్‌ బుమ్రా..

కెప్టెన్‌ రేసులో వినిపిస్తున్న మరో పేరు బుమ్రా. ఈ బౌలింగ్‌ మెషిన్‌ ప్రపంచకప్‌లో బ్యాటర్లను వణికించింది. మూడు ఫార్మాట్లలో ఇతడు ఆడుతున్నాడు. బ్యాటర్ల బలహీనతలు గమనించి.. తగినట్లుగా బౌలింగ్‌ చేయడంలో సిద్ధహస్తుడు. ఇతడికి నాయకత్వ అనుభవం చాలా తక్కువ. గతంలో వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. మంచి వ్యూహ చతురత, గేమ్‌ అవేర్‌నెస్‌ అతడికి ఎక్కువ. గాయం నుంచి కోలుకొని వచ్చాక.. భారత్‌ జట్టు ఐర్లాండ్‌ పర్యటనకు నాయకత్వం వహించి గెలిపించాడు. మూడు ఫార్మాట్లలో కీలక బౌలర్‌ కావడం, గాయాల భయం కారణంగా అతడికి నాయకత్వ పగ్గాలు అప్పగించేందుకు సెలక్టర్లు సంకోచించవచ్చు. దీనికితోడు కెప్టెన్సీ అదనపు భారంగా మారి అతడి లయను దెబ్బతీస్తాయన్న భయాలూ ఉన్నాయి. 

ఇప్పటికే రేసులో గిల్‌..

తాజాగా జింబాబ్వేతో పొట్టి సిరీస్‌కు స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ పగ్గాలు అందుకొన్నాడు. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఫలితం అతడి భవిష్యత్తు నాయకత్వాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ ఫార్మాట్‌లో గుజరాత్‌ లీగ్‌ జట్టుకు ఇప్పటికే నాయకత్వం వహిస్తున్నాడు. కానీ, ఈసారి ప్రపంచకప్‌ జట్టుకు మాత్రం ఎంపిక కాలేదు. ఇప్పుడు రోహిత్‌-కోహ్లీ ఏకకాలంలో ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడంతో జట్టులో గిల్‌ స్థానం దాదాపు ఖాయమైంది. ఇక వన్డేల్లో ఇప్పటికే కీలక బ్యాటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

పోటీలో పంత్‌ కూడా..

యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ పేరు కూడా కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకోవచ్చు. గాయం తర్వాత మళ్లీ మంచి దూకుడుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. వికెట్ల వెనక ఉంటూ బ్యాటర్ల బలహీనతలు, పిచ్‌ మార్పులను వేగంగా అంచనా వేయగల సత్తా అతడికి ఉంది. గతంలో లెజెండ్‌ కెప్టెన్‌ ధోనీ కూడా ఇవే స్కిల్స్‌తో జట్టును విజయపథంలో నడిపించిన సంగతి తెలిసిందే. 2024లో తాను బ్యాటింగ్‌లో రాణిస్తూనే దిల్లీ లీగ్‌ జట్టును నడిపించాడు. 2022లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమ్ ఇండియా 2-2తో డ్రా చేసుకొంది. జట్టులో వికెట్‌ కీపర్ రోల్‌కు విపరీతమైన పోటీ ఉండటం పంత్‌కు నెగిటివ్‌ పాయింట్‌. సంజూ, ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌, ధ్రువ్‌ జురెల్‌ వంటి వారితో పోటీపడాలి. దీంతో టీమ్‌ లెవన్‌లో అతడు స్థానం సుస్థిరం చేసుకోవాల్సి ఉంది.

వీరిలో చాలామందికి ఇప్పటికిప్పుడు నాయకత్వ బాధ్యతలు అప్పగించకపోయినా.. భవిష్యత్తు కోసం సిద్ధం చేయవచ్చు. ఇక కొత్త కెప్టెన్‌కు డిప్యూటీ పోస్టు కూడా జట్టులో భర్తీ చేయాల్సివస్తే.. వీరిలో ఒకరికి అవకాశం రావచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని