YSRCP: వైకాపా నేతల చేతుల్లోకి పేదల భూములు

ఉమ్మడి విశాఖ జిల్లాలో వైకాపా ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల కోసమని చేపట్టిన భూసమీకరణలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. రైతులను మోసగించి రూ.కోట్ల విలువైన భూములను  కొందరు తేలికగా కొట్టేశారు.

Published : 30 Jun 2024 05:30 IST

ఉమ్మడి విశాఖ జిల్లాలో భూసమీకరణ పేరుతో మాయాజాలం

భీమిలి మండలం నేరెళ్లవలస వద్ద చేతులు మారిన విలువైన భూములు

ఈనాడు, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో వైకాపా ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల కోసమని చేపట్టిన భూసమీకరణలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. రైతులను మోసగించి రూ.కోట్ల విలువైన భూములను కొందరు తేలికగా కొట్టేశారు. మధ్యవర్తులను రంగంలోకి దింపి రైతులే స్వయంగా భూములను అమ్మేసేలా వ్యూహాలు పన్నారు. ప్రభుత్వం భూములు తీసేసుకుంటుందని, డబ్బులు ఆశించినంతగా రావని భయపెట్టి ఆ తర్వాత తక్కువకే వాటిని విక్రయించేలా పత్రాలు రాయించుకున్నారు. ప్రధానంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భీమిలి, ఆనందపురం, పద్మనాభం, సబ్బవరం, పరవాడ, అనకాపల్లి మండలాల్లో ఈ తరహా లావాదేవీలు అధికంగా జరిగాయి. వైకాపా ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకానికి రాష్ట్రమంతటా ఒక విధానం అమలు చేస్తే.. విశాఖలో మరోలా చేసింది. మిగిలిన ప్రాంతాల్లో భూమి లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసింది. విశాఖలో భూసమీకరణను అమలు చేసింది. రైతుల నుంచి ఎసైన్డ్, ఆక్రమిత భూములు సమీకరించారు. ఎసైన్డ్‌ భూములకు ఎకరాకు 900 గజాలు, ఆక్రమణలైతే ఎకరాకు 400 గజాలు అభివృద్ధి చేసిన ప్లాట్లు పరిహారంగా ఇచ్చారు. వాటిని వెంటనే అమ్ముకునే హక్కు కూడా కల్పించారు. ఇదే వైకాపా నేతలకు వరంగా మారింది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 6 వేల ఎకరాలు సమీకరించారు. రైతులకు పరిహారంగా ఇచ్చేందుకు 1,236 ఎకరాలను గుర్తించి అభివృద్ధి చేశారు. వీటిల్లో చాలా మేరకు చేతులు మారిపోయాయి. ఆనందపురం, సబ్బవరం, భీమిలిలోని రైతులకు హక్కు పత్రాలు అందజేయగా.. వాటిని అదే రోజు వైకాపాకు చెందిన మధ్యవర్తులు ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించేశారు.


ఇక్కడ ఇలా.. 

  • భీమిలి మండలం నేరెళ్లవలస, జేవీఅగ్రహారం వద్ద ప్రసిద్ధ ఎర్రమట్టి దిబ్బలను ఆనుకొని రైతులకు పరిహారంగా ఇచ్చిన భూములు వైకాపా నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రియల్‌ ఎస్టేట్‌తో సంబంధమున్న ఓ నేతతో పాటు మాజీ మంత్రికి చెందిన కుటుంబీకులు పత్రాలు రాయించుకొని 50 ఎకరాల వరకు కొట్టేశారు.
  • భీమిలి మండలం అన్నవరంలో రైతులకు పరిహారంగా ఇచ్చే ప్లాట్లను వైకాపా నేత అనుచరులు, ఓ కీలక అధికారి ముందే రాయించుకున్నారు. స్థానిక నేతలు రైతులతో మాట్లాడి గజానికి రూ.5 వేలు ఇచ్చేలా ఒప్పించారు. అందులో రూ.4,800 రైతులకు రూ.200 వరకు మధ్యవర్తులకు వెళ్లేలా మాట్లాడుకున్నారు. ఇలా 30 ఎకరాల వరకు పెద్దలపరమైంది.
  • రియల్‌ ఎస్టేట్‌తో సంబంధమున్న వైకాపా నేతలు మరికొందరు ఆనందపురం మండలం జీఎస్‌అగ్రహారంలో 50 ఎకరాలు, పాలవలసలో 30 ఎకరాలు, గిడిజాలలో 30 ఎకరాలు, రామవరంలో 50 ఎకరాలు, తంగుడుబిల్లి, కోళ్లవలసలో 40 ఎకరాలు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.
  • అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం, అనకాపల్లిలో 80 ఎకరాలు చేతులు మారాయి.

హడావుడిగా టెండర్లు: ఈ ప్లాట్లలో తారు రోడ్లు, కాలువల నిర్మాణానికి వీఎంఆర్‌డీఏ అత్యుత్సాహం చూపుతోంది. ప్రభుత్వం మారిన తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండానే రూ.కోట్లవ్యయంతో పనులకు టెండర్లు పిలిచారని సమాచారం. ఎన్నికలకోడ్‌ ముగియగానే పనులను ప్రతిపాదించారు. హడావుడిగా టెండర్లు పిలవడంపై విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని