Street Justice: దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?

పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఓ ఘటనపై ప్రతిపక్ష భాజపా, సీపీఎం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలన ఇలాగే ఉంటుందంటూ ఓ వీడియోను పోస్టు చేశాయి.

Published : 01 Jul 2024 00:14 IST

ప్రతిపక్షాల మండిపాటు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌  రాష్ట్రంలో జరిగిన ఓ అమానవీయ ఘటనపై ప్రతిపక్ష భాజపా (BJP), సీపీఎం (CPM) పార్టీలు మండిపడుతున్నాయి. నడి రోడ్డుపై చుట్టూ జనం గుమిగూడి ఉండగా.. ఇద్దర్ని ఓ వ్యక్తి ఇష్టమొచ్చినట్లుగా కొడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బాధితుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. కనీసం కనికరించకుండా పశువుల్ని బాదినట్లు వారిపై విరుచుకుపడటం, అందరూ చూస్తున్నా.. ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఈ ఘటన నార్త్‌ బెంగాల్‌లోని ఉత్తర్‌ దీనాజ్‌పుర్‌ జిల్లాలోని చోప్రా ప్రాంతంలో రెండు మూడు రోజుల క్రితం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీడియోను పరిశీలిస్తే.. కొంత మంది జనం గుమిగూడగా.. ఇద్దర్ని ఓ వ్యక్తి కర్రతో కిరాతకంగా కొడుతున్నాడు. వాళ్లు నొప్పితో విలవిల్లాడుతున్నా వదల్లేదు. కొట్టిన దెబ్బలకు కర్ర కూడా విరిగిపోయింది. ఇంతజరుగుతున్నా చుట్టుపక్కల వారు ఆపలేదు సరికదా.. మరింత కొట్టేలా అతడిని ప్రేరేపిస్తున్నారు. ఒక దశలో  ఆ వ్యక్తి మహిళ జుట్టు పట్టుకొని ఇష్టమొచ్చినట్లు తన్నేశాడు. భాజపా, సీపీఎం నేతలు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి తృణమూల్‌ పార్టీకి చెందిన తేజ్‌ముల్‌. స్థానిక ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు. ఏదైనా వివాదం తన దగ్గరకు వస్తే అప్పటికప్పుడు నచ్చినట్లు తీర్పు చెప్పి.. భౌతికంగా హింసిస్తాడనే పేరుంది. అయితే, వీరిద్దర్నీ ఎందుకు అలా కొట్టాడు? అనే దానిపై స్పష్టత లేదు. కానీ, అక్రమ సంబంధం కారణంతోనే వీరిపై భౌతిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మండిపడిన భాజపా

ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షపార్టీ భాజపా మండిపడింది. ‘పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ పాలనకు ఇదే నిదర్శనం’ అంటూ భాజపా ఐటీ విభాగం అధ్యక్షుడు, పార్టీ బెంగాల్‌ ఉపాధ్యక్షుడు అమిత్ మాలవ్యా ఎక్స్‌లో వీడియోను పోస్టు చేశారు. తృణమూల్‌ పాలనలో అమలవుతున్న చట్టాల గురించి దేశ ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. ‘‘ ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి. సందేశ్‌ఖాళీ లాంటి గ్రామాలెన్నో ఉన్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహిళలకు శాపంగా మారారు. బెంగాల్‌లో శాంతిభద్రతలు కొరవడ్డాయి.ఇలాంటి రాక్షసుడిపై సీఎం చర్యలు తీసుకుంటారా? లేదా షాజహాన్‌ షేక్‌కు అండగా నిలిచినట్లు ఇతడిని కూడా సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పశ్చిమ్‌ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ గ్రామం బాగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అక్కడ పంచాయతీ పెద్ద, పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు షాజహాన్‌ షేక్‌ మహిళలను లైంగికంగా వేధించేవాడని, రేషన్‌ దుకాణాల (పీడీఎస్‌) ద్వారా పేదలకు అందాల్సిన ఆహార ధాన్యాలను పెద్దయెత్తున నల్లబజారుకు తరలించాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ, మమతా బెనర్జీ మాత్రం అతడిని వెనకేసుకొచ్చారు.

ఇక్కడా బుల్డోజర్‌ న్యాయమే: సీపీఎం

మరోవైపు ఈ వీడియోను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ మహ్మద్‌ సలీం కూడా ఎక్స్‌లో షేర్‌ చేశారు. కంగారూ కోర్టులోనైనా విచారణ చేసిన తర్వాతే శిక్ష విధిస్తారని, కానీ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ పాలనలో మాత్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో మాదిరిగా బుల్డోజర్‌ న్యాయం అమలవుతోందని విమర్శించారు. ఈ వీడియో తీసిన వ్యక్తిని కూడా ఇంటి నుంచి బహిష్కరించారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇంతజరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్రకు మరిమితం కావడంపై ఆయన పెదవి విరిచారు. గతంలో ఓ సీపీఎం కార్యకర్తను తేజ్‌ముల్‌ హత్య చేశాడని, దీనిపై కేసు కూడా నడుస్తోందని సలీం గుర్తు చేశారు.

నిందితుడిని ఉపేక్షించేది లేదు: తృణమూల్‌

తాజా ఘటనపై అధికార తృణమూల్‌ స్పందించింది. ఇలా వ్యవహరించడం హేయమైన చర్య అని, నిందితుడు ఎంతటి వాడైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. పార్టీ అధికార ప్రతినిధి రిజు దత్తా మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టిపారేశారు. ‘‘ ఇలాంటి ఘటనలు దారుణం. పార్టీలతో సంబంధం లేదు. నిందితుడు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికే కేసు నమోదైంది. పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు’’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని