AIADMK: మళ్లీ ఎన్డీయేలో చేరం.. అన్నామలైని తొలగించాలని మేం కోరం: అన్నాడీఎంకే

తమిళనాడులో భాజపాతో కటీఫ్‌ చెప్పిన అన్నాడీఎంకే కొత్త కూటమి ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.

Published : 28 Sep 2023 15:27 IST

చెన్నై: తమిళనాడు(Tamil Nadu)లో భాజపాకు కటీఫ్‌ చెప్పి ఎన్డీయే నుంచి వైదొలగిన అన్నాడీఎంకే(AIADMK) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది.  భాజపాతో నాలుగేళ్ల బంధానికి గుడ్‌బై చెప్పిన మూడు రోజుల అనంతరం ఈ నిర్ణయం ప్రకటించింది. తమ పార్టీ నిర్ణయాన్ని సీఎం స్టాలిన్‌, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ డ్రామాగా పేర్కొంటున్నారని.. మళ్లీ తాము భాజపాతో పొత్తు పెట్టుకొనే అవకాశమే లేదని అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి కేపీ మునుస్వామి అన్నారు.  కృష్ణగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్టు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైని తొలగించాలని తాము కోరడంలేదన్నారు.  అన్నాడీఎంకే లాంటి పెద్ద పార్టీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని కోరడం చిన్నతనం అవుతుందన్నారు. తాము అలాంటి తప్పు ఎప్పుడూ చేయబోమని పేర్కొన్నారు. మరో పార్టీ ఎలా పనిచేయాలో చెప్పేంత సంస్కారహీనులం కాదన్న ఆయన.. అన్నాడీఎంకే అలాంటి పార్టీ కాదన్నారు.  మళ్లీ ఎన్డీయేలో చేరతారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నలకు మునుస్వామి స్పందించారు. ‘‘స్టాలిన్‌, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ ఇదంతా డ్రామా అని విమర్శిస్తున్నారు. భాజపాతో బంధం తెంచుకున్నామన్న భయంతోనే వారు అలా మాట్లాడుతున్నారు’’ అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మేం ఎన్డీయేలో చేరం.. కానీ ఎడప్పాడి పళనిస్వామి సారథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తాం’’ అని బదులిచ్చారు. తమిళనాడులో 

భాజపా సారథ్యంలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌(ఎన్డీయే) నుంచి సోమవారం అన్నాడీఎంకే వైదొలగిన విషయం తెలిసిందే. భాజపా రాష్ట్ర నాయకత్వ వైఖరి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైతో అన్నాడీఎంకేకు వైరం కొనసాగుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురైతోపాటు జయలలితపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అన్నాడీఎంకే తీవ్ర ఆవేదనకు గురిచేయడం, తదితర కారణాల నేపథ్యంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని