Rahul gandhi: ప్రతిపక్ష నేతగా రాహుల్‌.. ఈ నియామకాల్లో కీలక భూమిక

Rahul gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ నియమితులయ్యారు. దీంతో ఆయనకు కొన్ని అధికారాలు, సౌకర్యాలు దక్కనున్నాయి.

Published : 26 Jun 2024 20:55 IST

Rahul gandhi | దిల్లీ: దాదాపు పదేళ్ల తర్వాత లోక్‌సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul gandhi) తాజాగా ఆ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేబినెట్‌ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందనున్నారు. లోక్‌సభలో విపక్ష కూటమికి నేతృత్వం వహించడమే కాకుండా.. ఈసీ, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలకు బాస్‌ల నియామకంలో కీలక భూమిక పోషించనున్నారు.

2014, 2019లలో మొత్తం సీట్లలో 10 శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు. దీంతో రెండు దఫాలుగా ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌కు ఆ హోదా దక్కింది. వాస్తవానికి 1969 వరకూ ప్రతిపక్ష నేతకు ఎలాంటి గుర్తింపు, హోదా, ప్రత్యేకాధికారాలు ఉండేవి కావు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత జీతభత్యాల చట్టం-1977 ద్వారా ప్రత్యేక గుర్తింపునివ్వడం మొదలుపెట్టారు. దీంతో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీకి కేబినెట్‌ మంత్రికి ఉండే సౌకర్యాలు, హోదా దక్కనున్నాయి. వేతనంగా రూ.3.3 లక్షలు, జడ్‌+ కేటగిరీ భద్రత లభిస్తుంది. పార్లమెంట్‌ బిల్డింగ్‌లో ఆయనకో కార్యాలయం, ప్రభుత్వ బంగ్లా, సిబ్బంది కూడా ఉంటారు. లోక్‌సభలో విపక్ష సభ్యులు కూర్చునే చోట తొలి సీటు కేటాయిస్తారు.

జీరో FIR, ఆన్‌లైన్‌ ఫిర్యాదులు.. జులై 1 నుంచే కొత్త చట్టాలు

నియామకాల్లో..

ప్రతిపక్ష నేతగా కొన్ని నియామకాల విషయంలో రాహుల్ గాంధీ భాగస్వామ్యం ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌, ఇద్దరు కమిషనర్లను నియమించే ముగ్గురు సభ్యుల కమిటీలో రాహుల్‌ గాంధీ ఒకరిగా ఉంటారు. ప్రధాని, కేంద్రమంత్రి ఇతర సభ్యులుగా ఉంటారు. అలాగే, సీబీఐ, ఈడీ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ వంటి ప్రభుత్వ ఏజెన్సీలకు అధిపతులను నియమించే కమిటీలోనూ రాహుల్‌ కీలకంగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నియమించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ కమిటీలో సభ్యుడిగా ఉంటారు. దీంతోపాటు ప్రతిపక్ష నేతగా పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌, కొన్ని జాయింట్‌ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా రాహుల్‌ గాంధీ వ్యవహరిస్తారు.

తండ్రి, తల్లి తర్వాత..

1989 డిసెంబరు 18 నుంచి 1990 డిసెంబరు 23 వరకూ రాజీవ్‌ గాంధీ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. దీంతో ప్రతిపక్ష నేతలుగా పని చేసిన ప్రత్యేక రికార్డు రాహుల్‌ గాంధీతోపాటు, ఆయన తండ్రి, తల్లికి దక్కినట్లయింది. 7, 8 లోక్‌సభలతో పాటు, 16, 17 లోక్‌సభల్లో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతలెవరూ లేరు. ఇప్పుడు 18వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ వ్యవహరించనున్నారు. 1970 జూన్‌ 19న జన్మించిన రాహుల్‌ గాంధీ 2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2004, 2009, 2014లలో అమేఠీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 2019లో అమేఠీ, వయనాడ్‌ నుంచి పోటీ చేశారు. అమేఠీలో ఓడిపోయి వయనాడ్‌లో గెలిచారు. 2024లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు. వయనాడ్‌కు రాజీనామా చేసి ప్రస్తుతం తన తాత, నానమ్మ, అమ్మ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ నియోజకవర్గానికి ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని