KCR: మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్‌

కేసీఆర్‌తో భారాసకు చెందిన జడ్పీ ఛైర్‌పర్సన్లఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మళ్లీ భారాసకే ప్రజలు పట్టం కడతారని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కొంచెం ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు.

Updated : 03 Jul 2024 07:21 IST

కాంగ్రెస్‌ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు
త్వరలోనే అన్ని స్థాయుల్లో పార్టీ కమిటీలు
జడ్పీ ఛైర్‌పర్సన్లతో భారాస అధినేత కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మళ్లీ భారాసకే ప్రజలు పట్టం కడతారని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కొంచెం ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ సారి మళ్లీ వచ్చాక మరో 15 ఏళ్లు భారాసయే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని.. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగొచ్చని తెలిపారు. మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని, వచ్చే ఎన్నికల్లో భారాస తరఫున ఎవరికి బీ ఫాం దక్కితే వాళ్లదే విజయమని ఆయన తేల్చిచెప్పారు.స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. కొంచెం కష్టపడితే భారాసకే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పార్టీలో అన్ని స్థాయుల్లోని కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామన్నారు. సోషల్‌ మీడియా విభాగాన్ని పటిష్ఠంగా తయారు చేస్తామని చెప్పారు. భారాస జడ్పీ ఛైర్‌పర్సన్లతో మంగళవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని కేసీఆర్‌ సన్మానించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన జడ్పీ ఛైర్‌పర్సన్లతో కలిసి ఆయన ఫొటోలు దిగారు. 

కేసీఆర్‌తో భారాసకు చెందిన జడ్పీ ఛైర్‌పర్సన్లు

‘‘కాంగ్రెస్‌ పాలనను చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఒక లక్షణం ఉంది. ఒకసారి అధికారంలోకి రాగానే.. పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజలతో ఛీ అనిపించుకునేలా వాళ్లు ప్రవర్తిస్తారు. భారాస పదేళ్ల పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కరెంటు, తాగునీటి ఇబ్బందులతో పాటు శాంతిభద్రతల సమస్యలు కూడా తలెత్తడం బాధాకరం. భారాస ప్రభుత్వంలో అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని చూసి.. ‘నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా?’ అని ప్రజలే ఏవగించుకుంటున్నారు. ప్రజాజీవితంలోకి వచ్చాక.. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులు. మంచి యువ నాయకత్వాన్ని తయారు చేస్తాం. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు సౌజన్యం, గాంభీర్యం ఉండాలి. అలా కాకుండా కొందరు కేసీఆర్‌ ఆనవాళ్లను చెరిపేస్తామంటున్నారు. కేసీఆర్‌ తెలంగాణ తెచ్చిండు కాబట్టి.. దాన్నీ చెరిపేస్తారా? భారాస అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వైఎస్‌ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలను పేర్లు కూడా మార్చకుండా అమలు చేశాం. ఇప్పుడు రకరకాల పేర్ల మార్పుతో పథకాలకు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం. ప్రజల్లో ఉంటూ, వారి సమస్యలపై పోరాడదాం’’ అని కేసీఆర్‌ చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని