KTR: చిన్నచిన్న పొరపాట్లు చేశాం.. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘‘తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అహంకారంతో ఓడిపోయామన్న అభిప్రాయంతో నేను ఏకీభవించను. మేమంటే పడనివాళ్లు అలా దుష్ప్రచారం చేశారు.

Updated : 10 Jul 2024 10:08 IST

ఎమ్మెల్యేల అనర్హతను స్పీకర్‌ మూణ్నెల్లలో తేల్చాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కథనాన్ని చూపుతున్న కేటీఆర్‌

ఈనాడు, దిల్లీ: ‘‘తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అహంకారంతో ఓడిపోయామన్న అభిప్రాయంతో నేను ఏకీభవించను. మేమంటే పడనివాళ్లు అలా దుష్ప్రచారం చేశారు. పదేళ్లలో ప్రభుత్వపరంగా ఏ కొలమానంలో చూసినా మేం టాప్‌లో ఉన్నాం. ఆ విషయంలో మమ్మల్ని ఢీకొనలేక.. అహంకారం అని, అందుబాటులో ఉండరని ప్రచారం సృష్టించారు’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. నాలుగు రోజులుగా దిల్లీలో ఉన్న ఆయన మంగళవారం విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెరాస పేరును భారాసగా మార్చడం వల్ల నష్టం వచ్చిందని తాను భావించడం లేదన్నారు.

తొత్తుల్ని పైన కూర్చోబెట్టి ఎత్తులు

‘‘తెలంగాణలో నాయకత్వం బలంగా ఉండటం ఇష్టం లేనివారు కేసీఆర్, కేటీఆర్‌లకు అహంకారం అని ప్రచారం చేశారు. కేసీఆర్‌ ఎవరికీ లొంగని వ్యక్తి కనుక.. ఆయన్ను తొక్కడానికి తొత్తుల్ని పైన కూర్చోబెట్టి అలా ఎత్తులు వేశారు. మేం అహంకారం చూపెట్టి ఉంటే యూట్యూబ్‌లో మాపై అడ్డగోలు ప్రచారం చేసిన, దుర్భాషలాడిన వాళ్లను వదిలిపెట్టేవాళ్లమా? హైదరాబాద్, తెలంగాణ బాగుండాలని కోరుకోవడం అహంకారమా? ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి తేడా తెలియకపోతే ఎలా?

ప్రజల తప్పు లేదు...

మా ఓటమికి మూడు, నాలుగు కారణాలున్నాయి. అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచేవారా అంటే..  ఏపీలో జగన్‌ చాలామంది అభ్యర్థులను మార్చారు. అయినా వైకాపా ఓడిపోయిందిగా! ఎన్నికల్లో గెలవడానికి ఒక్క సూత్రం అంటూ ఉండదు. అది తెలిసి ఉంటే ప్రశాంత్‌కిశోర్‌ లాంటి వారి హవా నడుస్తుండేది. కొన్ని విషయాల్లో చిన్నచిన్న పొరపాట్లు చేశాం. ఇందులో ప్రజల తప్పు లేదు. మాకు ఓటేయకపోవడం ప్రజల తప్పు అని ఎవరైనా అంటే అది సరికాదు. కొన్ని విషయాల్లో మా వైఖరి మార్చుకొని ఉండాలన్నది 100% నిజం. 

మాకు, వాళ్లకు 21 సీట్లే తేడా

మాకు అసెంబ్లీ ఎన్నికల్లో 38% ఓట్లు వచ్చాయి. మాకు, కాంగ్రెస్‌కు మధ్య కేవలం 4 లక్షల ఓట్లు, 21 సీట్లు మాత్రమే వ్యత్యాసం. ఎన్నో విషయాల్లో విజయాలు సాధించినా ప్రజా సంబంధాల విషయంలో ఎక్కడో కొంత గ్యాప్‌ వచ్చింది. మేం చేసినదాన్ని సరిగా ప్రచారం చేసుకోలేకపోయాం. నా ధోరణి (యాటిట్యూడ్‌) 2014లో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. అప్పట్లో అదే గెలిపించింది. 2023లో ఎందుకో సాధ్యం కాలేదు. 

ఇప్పటికీ కేసీఆరే పెద్ద నాయకుడు 

ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఇప్పటికీ తెలంగాణలో కేసీఆరే పెద్ద నాయకుడు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా రెండుసార్లు అధికారాన్ని చేపట్టారు. ఇప్పుడు కిందపడ్డాం. దులుపుకొని లేచి మళ్లీ పరుగెత్తాలి. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అభ్యర్థులను కాకుండా మోదీని చూసి ఓటేశారు. అందువల్లే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినవారు కూడా ఎంపీలుగా గెలిచారు. 

అంశాలవారీగా మద్దతు

రాజ్యసభలో కేంద్రానికి అంశాలవారీగా మద్దతిస్తాం. ఇప్పటివరకు అదే పద్ధతి అనుసరిస్తూ వచ్చాం. ఇకముందూ అలాగే ఉంటాం. కాంగ్రెస్‌ కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వ బిల్లులకు మద్దతు పలికింది. అంతమాత్రాన ఆ రెండు పార్టీలూ ఒక అవగాహనకు వచ్చాయని చెప్పలేం. భాజపా-భారాస కుమ్మక్కయ్యాయన్న ఆరోపణల్లో నిజం లేదు. 

ఏపీలో ఆశ్చర్యకరంగా ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు మా అవగాహనకు అతీతంగా జరిగాయి. పేదలకు జగన్‌ చాలా సంక్షేమ పథకాలు అమలుచేశారు కాబట్టి ఆయన వైపు మొగ్గు ఉంటుందని మాకు రిపోర్ట్‌ వచ్చింది. అదే మేం చెప్పాం. కానీ ఫలితాలు ఆశ్చర్యకరంగా వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఒకవైపు అయింది. పవన్‌కల్యాణ్, భాజపా, తెదేపాలు వేర్వేరుగా పోటీచేసి ఉంటే భిన్నంగా ఉండేదేమో! నా మిత్రుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రోజూ ప్రజల్లో ఉండేవారు. అయినా ఓడిపోయారు. అందువల్ల ఎమ్మెల్యేలు జనాల్లో లేకపోవడంవల్ల ఓడిపోయారని చెప్పడానిక్కూడా వీల్లేదు. ఎన్నికల ఫలితాలకు.. అభివృద్ధికి, సంక్షేమానికి సంబంధం లేదని అర్థమైంది. 

రెండు రాష్ట్రాలకు చంద్రబాబు ఎక్కువ నిధులు తేవాలి

అయిదేళ్ల క్రితం చంద్రబాబు పనైపోయిందన్నారు. ఇప్పుడు ఆయన మళ్లీ గెలిచారు. దిల్లీలో ఎక్కడచూసినా ఆయన పోస్టర్లే కనిపిస్తున్నాయి. చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల మధ్య సమావేశాన్ని ముఖ్యమంత్రుల మధ్య జరిగిందిగానే చూడాలి. చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేలో కీలకంగా ఉన్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు తేవాలని కోరుకుంటున్నాం. తెలంగాణకు మేలు జరగడంలో ఆయన పాత్ర ఉపయోగపడితే స్వాగతిస్తాం. మేం ఆంధ్రాలో భారాసను పెట్టినప్పుడు తెలంగాణలో తెదేపాను బలోపేతం చేస్తామని ఆయన చెప్పడంలో తప్పులేదు’’ అని కేటీఆర్‌ వివరించారు.

కూటముల్లో లేనివారు ఓడిపోయారు 

లోక్‌సభ ఎన్నికలు మోదీ, యాంటీ మోదీ విధానంలో జరిగాయి. ఆయనకు మద్దతు పలికేవారు ఎన్డీయేలో, వ్యతిరేకించేవారు ఇండియా కూటమిలో చేరిపోయారు. ఈ రెండు కూటముల్లో లేనివారు ఓడిపోయారు. కేరళలో సీపీఎం ఇండియా కూటమిలో లేకపోవడం వల్ల ఒక్క సీటుకే పరిమితమైంది. తమిళనాడులో ఆ కూటమిలో చేరడంవల్ల 2 సీట్లు గెలుచుకొంది. ఏ కూటమిలో లేని కారణంగా ఏపీలో వైకాపా, తెలంగాణలో భారాస, ఒడిశాలో బిజద, ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ, పంజాబ్‌లో అకాలీదళ్‌ దెబ్బతిన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని