KCR: ప్రజాతీర్పు శిరోధార్యం

ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని, వారి తీర్పే శిరోధార్యమని, వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Published : 05 Jul 2024 04:38 IST

భారాస శ్రేణులకు పార్టీ అధినేత కేసీఆర్‌ దిశానిర్దేశం

ఎర్రవల్లిలోని తన నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతున్న భారాస అధినేత కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని, వారి తీర్పే శిరోధార్యమని, వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. అధికారం, ప్రతిపక్షం రెండూ శాశ్వతం కాదని తెలిపారు. అధికారం కోల్పోయామని బాధపడడం సరైన రాజకీయ నాయకుడి లక్షణం కాదని, ప్రజాసంక్షేమం కోసం కొనసాగే నిరంతర ప్రక్రియనే రాజకీయమని పేర్కొన్నారు. ప్రజలతో కలిసి ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు. గురువారం ఎర్రవల్లిలోని తన నివాసానికి వచ్చిన ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల భారాస నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించారు. ‘గత భారాస ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు, తాగు నీరు, నిరంతర విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, సీఎంఆర్‌ఎఫ్‌ వంటి అనేక పథకాలను ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగించకపోవడంతో తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతోంది. మన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా కొనసాగింది. ఇక్కడి వ్యవసాయ ప్రగతిని చూసి పక్క రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్‌ పాలన కావాలని కోరుకున్నారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో మహారాష్ట్ర రైతులు తీవ్ర ఆవేదన చెందారు. మనం దేశ రైతాంగ ప్రగతి కోసం బయలుదేరిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రజల నిర్ణయం ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని నిరుత్సాహపర్చింది. అయినా అధైర్యపడొద్దు. రాబోయేది భారాస ప్రభుత్వమే. తెలంగాణ సంపూర్ణ అభివృద్ధే భారాస అంతిమ లక్ష్యం. గెలుపోటములకు అతీతంగా నిరంతర కృషి కొనసాగించడమే మన కర్తవ్యం’ అని కేసీఆర్‌ ఉద్బోధించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తూ.. వారితో ఫొటోలు దిగారు. నియోజకవర్గాల పేర్లను పార్టీ ముందస్తుగా ప్రకటిస్తుందని, ఆ క్రమంలో తనను కలవడానికి రావాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ముందస్తు సమాచారం లేకుండా వచ్చి ఇబ్బందిపడొద్దని శ్రేణులను కోరారు.

కేసీఆర్‌ను కలిసిన గోరటి వెంకన్న 

ప్రజలు తమ హక్కులను కాపాడుకునేలా కవులు, రచయితలు ఎప్పటికప్పుడు వారిలో చైతన్యం నింపాలని కేసీఆర్‌ అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గురువారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన కవితా సంకలనాలను ఆయనకు అందజేశారు. విద్యుత్, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ద్రోహులను పసిగట్టడంలో నాటి తెలంగాణ నాయకత్వ చైతన్యరాహిత్యం రైతాంగానికి తీరని శాపంగా మారిందని కేసీఆర్‌ అన్నారు. అటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కవులు, కళాకారులు, మేధావుల సాహిత్య సాంస్కృతిక ప్రక్రియ ఒకవైపు.. భారాస రాజకీయ ప్రక్రియ మరోవైపు జమిలిగా సాగి ప్రజల్లో తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేశాయన్నారు. ఈ సమావేశంలో సీనియర్‌ జర్నలిస్టు వర్దెల్లి వెంకన్న తాను రచించిన ‘పిట్ట వాలిన చెట్టు’ పుస్తకాన్ని కేసీఆర్‌కు అందించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి, శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని