Paper Leaks: పేపర్‌ లీక్‌ చేస్తే.. యావజ్జీవకారాగార శిక్ష.. రూ.కోటి జరిమానా!

పేపర్‌ లీకేజీ సమస్యతో సతమతమవుతున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా ఘటనలను రూపుమాపేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

Published : 26 Jun 2024 00:05 IST

లఖ్‌నవూ: పేపర్‌ లీకేజీలతో తీవ్ర సతమతవుతున్న సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) సారథ్యంలోని యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ తరహా ఘటనలపై ఉక్కుపాదం మోపేందుకు వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్‌ను (Ordinance) తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు మంగళవారం కేబినెట్ ఆమోదముద్ర వేసింది. నేర తీవ్రతను బట్టి కనిష్ఠంగా రెండేళ్లు, గరిష్ఠంగా యావజ్జీవ కారాగారశిక్ష, రూ. కోటి వరకు జరిమానా విధించనున్నారు. ఈ తరహా నేరాలను నాన్‌బెయిల్‌బుల్‌ కేసులుగా నమోదు చేయనున్నారు. బెయిల్‌ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడినా.. కఠిన నిబంధనలు విధించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తోపాటు యూపీ సబార్డినేట్స్‌ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు, యూపీ బోర్డు, రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీలు, దాని అధీకృత సంస్థలు, ఆయా సంస్థలు నియమించిన ఏజెన్సీలన్నింటికీ ఈ ఆర్డినెన్స్‌ వర్తిస్తుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.

అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కన్ఫర్మేషన్‌, ప్రమోషన్‌ కోసం నిర్వహించే పరీక్షలు కూడా ఈ ఆర్డినెన్స్‌ పరిధిలోకి వస్తాయి. తప్పుడు ప్రశ్నపత్రాలు సృష్టించడం, ఉద్యోగాల పేరుతో తప్పుడు వెబ్‌సైట్‌లు నడిపించడం కూడా నేరం కిందికే వస్తుంది. ఒక వేళ లీకేజీ లేదా ఇతర ఏదైనా కారణాల వల్ల పరీక్ష రద్దయితే.. అందుకు కారకులైనవారు, నేరానికి పాల్పడిన వారిపైనే ఆ ఆర్థిక భారం వేసేందుకు వీలుగా ఆర్డినెన్స్‌లో ప్రత్యేక నిబంధన తీసుకొస్తున్నారు. నేరానికి పాల్పడిన, సహకరించిన ఏజెన్సీలు లేదా సంస్థలను శాశ్వతంగా బ్లాక్‌ లిస్టులో పెట్టనున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో నిర్వహించిన పలు ఉద్యోగ అర్హత పరీక్షల ప్రశ్న పత్రాలు లీకైన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే దీనికి ఓ పరిష్కారాన్ని చూపిస్తానని అప్పట్లోనే హామీ ఇచ్చారు. తాజాగా ఆ దిశగా చర్యలు చేపట్టారు. యూపీలో ఇటీవల నిర్వహించిన రివ్యూ ఆఫీసర్‌/ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్‌ ఉద్యోగాలతోపాటు, 60 వేల కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షలు లీకేజీ కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని