Andhra news: టీడీఆర్‌ బాండ్లలో అక్రమాలపై విచారణ.. నివేదికలు వచ్చాకే చర్యలు: మంత్రి నారాయణ

తణుకు టీడీఆర్‌ బాండ్లలో అనేక అక్రమాలు జరిగాయని, వాటిని కొనుగోలు చేసిన వారంతా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారని మంత్రి నారాయణ అన్నారు.

Updated : 04 Jul 2024 19:00 IST

అమరావతి: తణుకు టీడీఆర్‌ బాండ్లలో అనేక అక్రమాలు జరిగాయని, వాటిని కొనుగోలు చేసిన వారంతా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారని మంత్రి నారాయణ అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నెల్లూరు, కడప లే అవుట్ల అనుమతుల్లో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటిపై కమిటీలు వేశాం. ఆ నివేదికల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. తణుకులో టీడీఆర్‌ బాండ్లలో అనేక అక్రమాలు జరిగాయి. రూ.36 కోట్లు చెల్లించాల్సిన చోట రూ.700 కోట్లకు పైగా పంపిణీ జరిగినట్లు నివేదిక వచ్చింది. దానిపై పూర్తిగా చర్చించిన తర్వాత వివరాలు వెల్లడిస్తాం. ఆ బాండ్లు తీసుకున్న వారి తప్పులేదు. అమ్మిన వారిదే తప్పు. అర్బన్‌ అథారిటీ కడుతున్న ఇళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత వాటిపై ముందుకెళ్తాం. 

గత ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ సరిగా చేయకుండా మున్సిపాలిటీలకు అందాల్సిన నిధులను దారి మళ్లించింది. తెదేపా అధికారంలో ఉన్న సమయంలో ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ బ్యాంక్‌ నుంచి రూ.5,300 కోట్లు తీసుకొచ్చాం. ఆ మొత్తం 2019 ఫిబ్రవరిలో మంజూరైంది. గత నెల 30తో గడువు ముగియగా తెచ్చిన నిధుల్లో వైకాపా ప్రభుత్వం కేవలం రూ.240 కోట్లే ఖర్చు చేసింది. అందులో సగం ఖర్చు చేసినా ఈ రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉండేవి. ఆ ప్రాజెక్టు గడువు పెంచమని లేఖ రాశాం. అమృత్‌-1, అమృత్‌-2 తాగునీటి ప్రాజెక్టుల నిధులు కూడా వినియోగించలేదు. 15వ ఫైనాన్స్‌ కమిషన్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.500 కోట్లకు పైగా వస్తే దానికి మ్యాచింగ్‌ చేయలేదు. బిల్లులు సరిగా అప్‌లోడ్‌ చేయక రూ.1150 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 9 లక్షల టిడ్కో ఇళ్లను అభివృద్ధి చేస్తే వైకాపా ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు’’ అని మంత్రి నారాయణ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని