CM Revanth Reddy: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి

విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.

Updated : 02 Jul 2024 19:47 IST

హైదరాబాద్‌: విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. చర్చల ప్రతిపాదనను ఆహ్వానిస్తూ ఈమేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నెల 6న హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ వేదికగా చర్చిద్దామని ఆహ్వానించారు. ‘‘విభజన సమస్యలను కలిసి పరిష్కరించుకుందాం. తెలుగు రాష్ట్రాల పరస్పర సహకారానికి ముఖాముఖి చర్చలు అవసరం. మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. మా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున చంద్రబాబును ఆహ్వానిస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు ఏమన్నారంటే...

విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6న హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి.. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్లవుతోంది. విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై పలు దఫాలుగా చర్చలు జరిగినా.. పరిష్కారం కాని అంశాలు ఇంకా ఉన్నాయి. వీటికి సామరస్యపూర్వక పరిష్కారం సాధించేందుకు కట్టుబడి ఉన్నాం. రెండు రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి దోహదపడేలా ముఖ్యమైన చిక్కులను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖాముఖి చర్చల ద్వారా కీలక అంశాలను పరిష్కరించుకునేందుకు వీలుంటుంది. ఈ చర్చలు మంచి ఫలితాలిస్తాయనే నమ్మకం ఉంది’ అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుస్థిర ప్రగతి సాధించడానికి.. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇది మన బాధ్యత. ప్రజల అభ్యున్నతికి దోహదపడేలా.. ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు ఇది కీలకం’ అని వివరించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రగతికి రేవంత్‌రెడ్డి చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు