Palla srinivasa Rao: తెదేపా కార్యకర్తలపై.. అక్రమ కేసులు తొలగించేందుకు కృషి

తెదేపా కార్యకర్తలపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. 

Published : 29 Jun 2024 03:41 IST

ఏ సమస్య ఉన్నా పార్టీ కార్యాలయానికి రండి 
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు 
మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ 

బాధ్యతల స్వీకరణ అనంతరం మాట్లాడుతున్న పల్లా శ్రీనివాసరావు

ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా కార్యకర్తలపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. న్యాయస్థానం పరిధిలో ఉన్న రాజకీయ ప్రేరేపిత కేసుల్ని ఏడాదిలో తొలగించేలా చూస్తానన్నారు. పార్టీకి ప్రభుత్వానికి సంధానకర్తగా వ్యవహరిస్తూ.. కార్యకర్తల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తానని తెలిపారు. ఏ సమస్య వచ్చినా పార్టీ కార్యాలయానికి రావాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల సమక్షంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని శుక్రవారం ఆయన స్వీకరించారు. విద్యాశాఖ మంత్రి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆయన్ను పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. నేతలు, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని లోకేశ్‌ సూచించారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి నామినేటెడ్‌ పదవులిచ్చి గౌరవిస్తామని ప్రకటించారు. సిద్ధాంతాలకు కట్టుబడి అధినాయకుడి ఆదేశాల్ని నాయకులు, కార్యకర్తలు అమలు చేశారన్నారు. గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినా తట్టుకుని ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తుచేశారు. 

పల్లా శ్రీనివాసరావును తెదేపా రాష్ట్ర అధ్యక్ష స్థానంలో కూర్చోబెడుతున్న మంత్రి నారా లోకేశ్‌

తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం బుద్ధి చెబుదాం..

అధికారం ఉందని ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించకూడదని శ్రీనివాసరావు అన్నారు. ‘మనమందరం ప్రజాస్వామ్యవాదులం. మన మూలాలు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. గత వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష నేతల్ని అణచివేయడానికే అధికారాన్ని వినియోగించింది. అందుకే ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలి. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి చట్టప్రకారం బుద్ధి చెబుదాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం. పార్టీ బలోపేతానికి యువ నాయకత్వాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. సీనియర్లను గౌరవిస్తూనే యువతను ప్రోత్సహిస్తాం. అమరావతి, పోలవరం నిర్మాణం సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి అధినాయకత్వంతో కలిసి ముందుకెళ్తాం’ అని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.


పల్లా శ్రీనివాసరావును అభినందిస్తున్న సీఎం చంద్రబాబు

పల్లాకు చంద్రబాబు అభినందనలు: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లి నివాసంలో చంద్రబాబును పల్లా దంపతులు కలిశారు. తనకీ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పల్లా శ్రీనివాసరావు సమర్థ నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని సీఎం అభిలషించారు. పల్లా బాధ్యతలు స్వీకరిస్తున్న చిత్రాల్ని చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు. మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నెట్టం రఘురాం, సీనియర్‌ నాయకుడు వర్ల రామయ్య తదితరులు పల్లాను సత్కరించి అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని