Byreddy Shabari: వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్‌: ఎంపీ బైరెడ్డి శబరి

వైకాపా ప్రభుత్వ అనారోగ్య ఆర్థిక విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని తెదేపా పార్లమెంటరీ పార్టీ ఉపనాయకురాలు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపించారు.

Published : 03 Jul 2024 05:13 IST

ఈనాడు, దిల్లీ: వైకాపా ప్రభుత్వ అనారోగ్య ఆర్థిక విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని తెదేపా పార్లమెంటరీ పార్టీ ఉపనాయకురాలు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపించారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ అని చెప్పుకొనే వైకాపా హయాంలో యువతకు భిక్షమెత్తుకొనే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆకలితో శ్రామికులు, అప్పులతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చిందని ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆమె తెదేపా తరఫున మాట్లాడారు.  తెదేపా అధినేత చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ చేసిన ఆరోపణలను బైరెడ్డి శబరి తిప్పికొట్టారు.

టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ మాట్లాడుతూ ‘‘ఈ రోజుల్లో ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటులోకి వస్తుంటే సొంతకాళ్లపై కాకుండా ఒకవైపు నీతీశ్‌కుమార్, మరోవైపు చంద్రబాబు పార్టీల ఊతకర్రలతో వస్తున్నట్లు అనిపిస్తోంది. మోదీ నిరంతరం ఇండియా కూటమి నేతలను అవినీతిపరులని ఆరోపిస్తున్నారు. మరి తెదేపా, ఎన్సీపీ నాయకులను సీబీఐ, ఈడీ అరెస్టుచేయలేదా? తెదేపా ముఖ్యనేతను గత ప్రభుత్వంలో ఈడీ, సీబీఐ అరెస్టుచేయలేదా?’’ అని అన్నారు. ఈ ఆరోపణలను బైరెడ్డి శబరి ఖండించారు. చంద్రబాబును సీబీఐ, ఈడీ ఎప్పుడూ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. ఏపీ సీఐడీ నంద్యాల లోక్‌సభ పరిధిలో ఆయన్ను అరెస్టు చేస్తే ప్రజలు అందుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారన్నారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్, వైకాపా పాలనలో ఉన్న నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో తెదేపా ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ సీటునూ కట్టబెట్టారని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని