MLA Kolikapudi: ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం

బాధితులకు సత్వర న్యాయం పేరుతో ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారి తీసింది.

Updated : 03 Jul 2024 07:14 IST

వైకాపా ఎంపీపీ భవనం కూల్చివేతకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత
ఆక్రమణలు ఉన్నాయని ఆరోపణ
యజమానికి నోటీసులిచ్చిన అధికారులు

కంభంపాడులో భవనం వద్ద కారుపై నిల్చున్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు

ఎ.కొండూరు, న్యూస్‌టుడే: బాధితులకు సత్వర న్యాయం పేరుతో ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారి తీసింది. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు ఎమ్మెల్యేకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్రమ కట్టడం పేరుతో భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. దీనిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామంటూ అధికారులు ఎమ్మెల్యేకు నచ్చజెప్పి పంపించారు. 

ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడులో వైకాపాకు చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త చెన్నారావు భవనం నిర్మిస్తున్నారు. తమ స్థలాలను ఆక్రమించి, అందులో అక్రమంగా భవంతి కడుతున్నారని కంభంపాడుకు చెందిన ముస్లిం మహిళతో పాటు విస్సన్నపేటకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఆదివారం కంభంపాడు వచ్చిన ఎమ్మెల్యే ఆ భవనాన్ని పరిశీలించారు. అది అక్రమ నిర్మాణమని భావించిన ఆయన.. వాటిని తొలగించి బాధితులకు స్థలం అప్పగించాలని ఆదేశించారు. అధికారులు తొలగించకపోతే తానే కూల్చివేస్తానంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. మంగళవారం ఉదయమే తెదేపా,    జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి పొక్లెయిన్, డోజర్‌తో భవనం వద్దకు చేరుకున్నారు. వైకాపా ఎంపీపీ వర్గం కూడా అక్కడికి చేరుకుంది. దీంతో భద్రాచలం జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచాయి. ఆక్రమణ తొలగించే వరకు అక్కడి నుంచి కదలనని ఎమ్మెల్యే తన వాహనం పైకి ఎక్కి కూర్చున్నారు.  


వైకాపా ఎంపీపీ నిర్మిస్తున్న భవనాన్ని పొక్లెయిన్‌తో కూల్చేస్తున్న వైనం

పోలీసులు అడ్డుకున్నా వినకుండా.. 

కూల్చివేత చర్యలను మైలవరం ఏసీపీ మురళీమోహన్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కట్టడం కూల్చవద్దని.. సర్వే చేసి ఆక్రమణలు ఉంటే తొలగిస్తామని అధికారులు చెప్పినా వినకుండా ఎమ్మెల్యే మొండిగా ముందుకెళ్లారు. బాధితులకు తక్షణమే న్యాయం జరగాలంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. పొక్లెయిన్‌ సిబ్బంది డాబా దిగువ గది ఒక వైపు పాక్షికంగా కూల్చేశారు. ఆక్రమణను నిర్ధారించి చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకు ఆ స్థలంలోకి ఎవరూ రావద్దని అధికారులు స్పష్టం చేయడంతో కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆర్‌ఎస్‌ నంబరు 197/14లో నిర్మిస్తున్న ఆ భవనానికి అనుమతుల్లేవని, అది అక్రమ నిర్మాణమని పంచాయతీ కార్యదర్శి నోటీసును అంటించారు.  తాము ఎవరి స్థలమూ ఆక్రమించలేదని, అక్రమంగా భవనం నిర్మించడం లేదంటూ ఎంపీపీ నాగలక్ష్మి తేల్చిచెప్పారు. భవనం ఎలా కూల్చివేస్తారో చూస్తామంటూ అనుచరులతో కలిసి ఒకటో అంతస్తులో బైఠాయించారు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించారు. వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి స్వామిదాసు ఎంపీపీకి మద్దతుగా వచ్చారు. తమ భవనం కూల్చివేతపై న్యాయపోరాటం చేస్తామని ఎంపీపీ నాగలక్ష్మి చెప్పారు. ఎమ్మెల్యే హడావుడి, అత్యుత్సాహం దాదాపు రెండు గంటలపాటు ఉద్రిక్తతలకు దారితీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని