Sonia Gandhi: మోదీ నైతికంగా ఓడిపోయారు

సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా, రాజకీయంగా, నైతికంగా ఓడియారని, అయినా అలాంటిదేమీ జరగలేదన్నట్లుగా కొనసాగుతున్నారని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ విమర్శించారు.

Updated : 30 Jun 2024 05:19 IST

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా, రాజకీయంగా, నైతికంగా ఓడియారని, అయినా అలాంటిదేమీ జరగలేదన్నట్లుగా కొనసాగుతున్నారని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో తనకు తాను దైవత్వాన్ని ఆపాదించుకున్న ఆయన.. ఓటర్ల తీర్పును అర్థం చేసుకున్నట్లు ఏ కోశానా కనిపించడం లేదన్నారు. ఈ మేరకు శనివారం ఒక పత్రికకు ఆమె వ్యాసం రాశారు. ‘‘లోక్‌సభ స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ప్రధాని తరఫు దూతలు విపక్ష ఇండియా కూటమిని అడిగినప్పుడు మేం దానికి అంగీకరించాం. ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం ప్రకారం ఉప సభాపతి పదవిని విపక్షంలోని ఒకరికి ఇవ్వాలని అడిగాం. అది సముచితం కూడా. సహేతుకమైన ఈ అభ్యర్థనకు ప్రభుత్వం ససేమిరా అంది. పార్లమెంటు పనితీరుకు, ఉభయపక్షాల మధ్య సమతౌల్యానికి విపక్షం కట్టుబడి ఉంది. ఏకాభిప్రాయ విలువ గురించి గొప్పగా చెప్పే మోదీయే ఘర్షణకు విలువనివ్వడాన్ని కొనసాగిస్తున్నారు’’ అని ఆరోపించారు. 

ప్రజాదృష్టి మళ్లించేందుకే ఎమర్జెన్సీ ప్రస్తావన

రాజ్యాంగంపై దాడి నుంచి ప్రజాదృష్టిని మళ్లించడం కోసమే ఎమర్జెన్సీ రోజుల గురించి మోదీ, లోక్‌సభ స్పీకర్, ఇతర నేతలు పార్లమెంటులో ప్రస్తావించారని సోనియా ఆరోపించారు. ఎమర్జెన్సీపై ప్రజలు 1977 మార్చిలోనే విస్పష్టమైన తీర్పునిచ్చారని, దానిని నిర్ద్వంద్వంగా అందరూ ఆమోదించారని చెప్పారు. నూతనంగా రూపొందించిన నేరన్యాయ చట్టాలను ప్రస్తుతానికి పక్కనపెట్టి పార్లమెంటరీ సమీక్షను నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ఆ చట్టాలను ఆమోదించినప్పుడు ఉభయసభల నుంచి 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని.. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజిపై అనుమానాస్పదరీతిలో మౌనం పాటించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల అంశాలను విపక్షం లేవనెత్తుతూనే ఉంటుందని, ప్రభుత్వం వాటిపై సానుకూలంగా స్పందించాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని