ministerial posts: హస్తినలో ఆశావహుల సందడి

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండటంతో ఆశావహులంతా హస్తిన బాట పట్టారు. విస్తరణలో కొత్తగా నలుగురిని క్యాబినెట్‌లోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.

Published : 27 Jun 2024 02:52 IST

మంత్రి పదవుల కోసం పలువురి దిల్లీ బాట

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండటంతో ఆశావహులంతా హస్తిన బాట పట్టారు. విస్తరణలో కొత్తగా నలుగురిని క్యాబినెట్‌లోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే అధిష్ఠానంతో చర్చలు కూడా జరిగాయని కాంగ్రెస్‌ ముఖ్యనాయకులు చెబుతున్నారు. ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై విన్నవించడం, పార్టీ అధిష్ఠానంతో చర్చించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 24న దిల్లీకి వెళ్లారు. ఆయనతోపాటు కొందరు మంత్రులు అదే రోజు వెళ్లగా, మరికొందరు మంగళవారం, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు బుధవారం హస్తినకు చేరుకున్నారు. మంత్రుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌ తదితరులున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జి.వివేక్, రామచంద్రునాయక్, మల్‌రెడ్డి రంగారెడ్డి తదితర ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కూడా దిల్లీ వెళ్లారు. ఎంపీలకు మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఇచ్చిన విందుకు కూడా వీరంతా హాజరైనట్లు తెలిసింది. ఆశావహుల్లో పలువురు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ను కూడా కలిసి మంత్రివర్గంలో తమకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసింది. 

నాలుగు పదవులు.. పోటీలో పలువురు..

రాష్ట్ర క్యాబినెట్‌ విస్తరణలో ఆరుగురిని తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం నలుగురిని తీసుకుని మరో రెండు మంత్రి పదవులను ఖాళీగా ఉంచనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, జి.వివేక్‌కు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రివర్గంలో ఉన్నందున ఆయన సోదరుడికి చోటు దక్కుతుందా అనే చర్చ ఉన్నా.. రాజగోపాల్‌రెడ్డి విషయంలో అధిష్ఠానం సానుకూలంగా ఉన్నట్లు పార్టీ ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. జి.వివేక్, ఆయన సోదరుడు వినోద్‌ ఎమ్మెల్యేలుగా ఉండగా, పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి వివేక్‌ కుమారుడు వంశీకృష్ణ గెలుపొందారు. వివేక్‌కు మంత్రివర్గంలో స్థానం లభించవచ్చని బలంగా వినిపిస్తోంది. కానీ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కూడా మంత్రిపదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈయనకు అవకాశమివ్వాలని ఓ సీనియర్‌ మంత్రి కూడా గట్టిగా కోరుతున్నట్లు తెలిసింది. మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. అందువల్ల ఆయనకు కచ్చితంగా స్థానం దక్కవచ్చని తెలుస్తోంది. బోధన్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేరు. విపక్షంలో ఉన్నప్పుడు సుదర్శన్‌రెడ్డి.. ఈడీ సహా పలు కేసులను ఎదుర్కొని గట్టిగా నిలబడ్డారని, దీంతోపాటు సీనియార్టీ, ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలు ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి స్పీకర్‌ ఉండగా, అదే జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం, పరిగి ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఎస్టీల నుంచి ఒకరిని క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. భారాస నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ఇప్పుడే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేదని సమాచారం. ఈ కారణంగానే మంత్రివర్గంలో రెండు స్థానాలు ఖాళీగా ఉంచుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడికి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చే అవకాశం ఉంది.


సోనియా గాంధీతో ఉత్తమ్‌ భేటీ

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం దిల్లీలోని 10-జన్‌పథ్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా సోనియాను కలిసిన ఉత్తమ్‌.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మంచి ఫలితాలు సాధించినందుకు అభినందనలు తెలిపారు. రాహుల్‌ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించినందుకు హర్షం వ్యక్తం చేశారు.

ఈనాడు, హైదరాబాద్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని