Andhra News: పేదల బియ్యంతో అక్రమాల సామ్రాజ్యం

పేదలకు పట్టెడన్నం పెట్టడానికి ప్రభుత్వం రూపాయికే కేజీ బియ్యం అందిస్తోంది. అందుకు కేజీకి రూ.39 ఖర్చుచేస్తోంది. ఇదే అదనుగా రేషన్‌ మాఫియా ఈ చౌకబియ్యాన్ని కొల్లగొడుతోంది.

Published : 30 Jun 2024 03:38 IST

రేషన్‌ మాఫియాకు చిరునామా కాకినాడ
కీలక శాఖల దాసోహంతో ఐదేళ్లూ ఆడిందే ఆట
అన్నివేళ్లూ వైకాపా నేత ద్వారంపూడి కుటుంబం వైపే

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌: పేదలకు పట్టెడన్నం పెట్టడానికి ప్రభుత్వం రూపాయికే కేజీ బియ్యం అందిస్తోంది. అందుకు కేజీకి రూ.39 ఖర్చుచేస్తోంది. ఇదే అదనుగా రేషన్‌ మాఫియా ఈ చౌకబియ్యాన్ని కొల్లగొడుతోంది. ఇందుకు కాకినాడను అడ్డాగా చేసుకుని పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తోంది. సొంతనౌకల్లో సరకు తరలిస్తూ.. విదేశాల్లోనూ గోదాములు కట్టుకుని అక్రమాల సామ్రాజ్యాన్ని విస్తరించారు. వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్లూ సాగిన ఈ అక్రమాల తంతుకు కీలక శాఖలు ఊతమందించాయి. కూటమి సర్కారు ఏర్పాటయ్యాక పాపాల పుట్ట కదిలింది. కాకినాడ రేషన్‌ మాఫియా అక్రమాలు బయటపడ్డాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పలు సంస్థల్లో సోదాలు చేశారు. వేలటన్నుల అక్రమ నిల్వలు సీజ్‌ చేయించారు. ఈ అక్రమాల్లో కాకినాడ వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబానిది, అనుచరులదే కీలక పాత్రని బాహాటంగా వెల్లడించారు. సీఐడీ విచారణ చేయిస్తామని ఆయన వెల్లడించడంతో కాక రేగింది.

ఆ కుటుంబంలో ముగ్గురూ..

వైకాపా ప్రభుత్వంలో అప్పటి కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రేషన్‌ వ్యవహారంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈయన తండ్రి భాస్కరరెడ్డి పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా వ్యవహరించారు. సోదరుడు వీరభద్రారెడ్డి రాష్ట్ర మిల్లర్ల సంఘం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా, షిప్పింగ్‌ సంస్థ సంఘం అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. కొందరు మిల్లర్లను, ఎగుమతిదారులను గుప్పెట్లో పెట్టుకుని వ్యవహారం సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. యాంకరేజి పోర్టుతోపాటు.. పలు గోదాముల్లో 12,915 టన్నుల బియ్యం సీజ్‌చేయడం.. ఈ సంస్థలు అనుయాయులవే కావడంతో అన్నివేళ్లూ ద్వారంపూడి వైపే చూపిస్తున్నాయి.  

అక్రమాలకు ఎర్ర తివాచీ

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో నెలకు 2.12 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంటే.. ఇందులో సగం మాఫియా పక్కదారి పట్టిస్తోంది. అర్హత లేనివారికి కార్డులు ఉండడం, వారికి ఈ బియ్యం తినే అవసరం లేకపోవడం మాఫియాకు కలిసొస్తోంది. ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్‌ వేయించుకుని సరకు పక్కన పెడుతున్నారు. ఊరూరా దళారులు సేకరించిన ఈ నిల్వలన్నీ ఓ చోటుకు చేరవేసి పోర్టుల ద్వారా విదేశాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. పోలీసు, రవాణా, పౌరసరఫరాలు, తూనికలు- కొలతలు, వాణిజ్యపన్నుల శాఖ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోర్టు ఇలా అన్ని శాఖల అధికారులూ అక్రమాల్లో సహకరించారు. పోర్టు ఆధీనంలోని గోదాముల్లోనూ చౌకబియ్యం గుర్తించడం.. పోర్టు అధికారులు ఏమీ తెలియనట్లు వ్యవహరించడంపై చర్చ నడుస్తోంది. పోర్టులకు వెళ్లే సరకుల తనిఖీకి చెక్‌పోస్టు వ్యవస్థ లేకపోవడం.. అక్కడి పర్యవేక్షక యంత్రాంగం దాసోహమవ్వడం అక్రమాలకు ఊతమిచ్చింది.

కాకినాడ నుంచి ఆఫ్రికా దేశాలకు

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి అడ్డదారిన సేకరిస్తున్న పేదల బియ్యాన్ని కాకినాడ, మచిలీపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు పంపిస్తున్నారు. పోర్టుల్లో బియ్యం లోడింగ్, అన్‌లోడింగ్‌కు బిహార్, ఒడిశా కూలీలను వినియోగిస్తున్నారు. గతంలో కాకినాడలోని యాంకరేజి పోర్టు ద్వారానే బియ్యం ఎగుమతులు ఉండేవి. ఇప్పుడు ప్రైవేటు పోర్టు ద్వారా ఎగుమతుల సామర్థ్యం పెంచి.. అదనపు బెర్తుల నిర్మాణానికి అవకాశం ఇచ్చి స్వలాభానికి వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో 400 రైస్‌మిల్లులు ఉన్నాయి ఆసియాలో అతిపెద్ద సామర్థ్యం ఉన్న మిల్లులు ఇక్కడ ఉండడం.. పౌరసరఫరాల వ్యవస్థ ఒక కుటుంబం చేతిలో ఉండడం కలిసొచ్చిన అంశం. ఐదేళ్లూ వేలకోట్ల అక్రమార్జనకు ఇదే ఊతమిచ్చింది. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించినా అక్రమ సేకరణ ఆగలేదు. ఎక్కడికక్కడ భారీగా నిల్వలు ఉంచారు. నూకలుగా చేసి తరలించే ప్రక్రియ కొనసాగించారు. మాఫియా లీలలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని