Nadendla Manohar: రేషన్‌ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ

‘పేదల పొట్టకొట్టి ఆఫ్రికన్‌ దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును ఎలా కబ్జా చేసిందో.. ఎలా వినియోగించుకుందో ఇన్నాళ్లూ విన్నాను.

Published : 30 Jun 2024 03:40 IST

పేదల పొట్టకొట్టి.. ఆఫ్రికన్‌ దేశాలకు బియ్యం తరలిస్తున్నారు
ద్వారంపూడి కుటుంబం అక్రమాలు చూసి ఆశ్చర్యపోయా
తనిఖీలు పూర్తయ్యేవరకు పోర్టులో బియ్యం ఎగుమతుల నిలిపివేత
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌

యాంకరేజ్‌ పోర్టులో తనిఖీలు చేస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌

ఈనాడు, కాకినాడ: ‘పేదల పొట్టకొట్టి ఆఫ్రికన్‌ దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును ఎలా కబ్జా చేసిందో.. ఎలా వినియోగించుకుందో ఇన్నాళ్లూ విన్నాను. కాకినాడలోని గోదాములు, యాంకరేజ్‌ పోర్టులో పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాను. రేషన్‌ మాఫియా అక్రమాలపై సమగ్ర నివేదిక తయారుచేసి ఈ కేసును సీఐడీకి అప్పగిస్తాం’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. అన్ని గోదాముల్లో లోతుగా తనిఖీలు చేయిస్తామని.. అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీలు పూర్తయ్యేవరకు షిప్పింగ్‌ మొత్తం నిలిపేయాలని పోర్టు అధికారులను ఆదేశించారు. యాంకరేజి పోర్టులో గోదాములు, బార్జిల్లో బియ్యం తరలిస్తున్న లంగరు రేవు పరిశీలించారు. 

12,915 టన్నుల బియ్యం స్వాధీనం.. 

కాకినాడ జిల్లాలో నిర్వహించిన రెండు రోజుల తనిఖీల్లో మొత్తం ఎనిమిది గోదాముల్లో ప్రభుత్వం పేదలకు సరఫరాచేస్తున్న బియ్యం ఉన్నట్లు ఆధారాలతో దొరికిందని.. 12,915 టన్నుల నిల్వలు సీజ్‌ చేశామని మంత్రి మనోహర్‌ వెల్లడించారు. కలెక్టరేట్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం లవన్‌ ఇంటర్నేషనల్, అయ్యప్ప ఎక్స్‌పోర్ట్స్‌ (బిబో), విశ్వప్రియ ఎక్స్‌పోర్ట్స్, సరళ ఫుడ్స్, సార్టెక్స్‌ ఇండియా, వి.ఎస్‌.రాజు గోదాముల్లో తనిఖీ చేసి 7,615.94 టన్నులు సీజ్‌ చేశామన్నారు. శనివారం కాకినాడ యాంకరేజి పోర్టులోని అశోక్‌ ఇంటర్నేషనల్‌ గోదాములో 2,800 టన్నులు, హెచ్‌1 గోదాములో 2,300 టన్నులు సీజ్‌ చేశామన్నారు. వీఎస్‌రాజు గోదాములో 2023- 24 పీడీఎస్‌ బియ్యం ట్యాగ్‌లు దొరికాయని, కేసులు పెడతామన్నారు.  గోదాముల్లో ఎవరు.. ఏ స్టాక్‌ తీసుకొచ్చి నిల్వ చేశారో తెలియదన్నట్లు వ్యవహరిస్తే ఊరుకోబోమని పోర్టు అధికారి ధర్మశాస్తపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పౌరసరఫరాల వ్యవస్థల్లో లోపాలపై 6ఏ కేసులు, తూనికలు- కొలతల శాఖ ద్వారా చర్యలు, పోలీసుశాఖ ద్వారా క్రిమినల్‌ కేసులూ ఉంటాయన్నారు. పట్టుబడిన బియ్యం గురించి ప్రశ్నిస్తే కొంతమంది తమిళనాడు పౌరసరఫరాల శాఖకు, ఇతర ప్రాంతాలకు పంపుతున్నామని చెబుతున్నారని... అది సరికాదన్నారు. పీడీఎస్‌ బియ్యం దారి మళ్లించినట్లు తేలిందని.. నూటికి నూరుశాతం క్రిమినల్‌ కేసులు పెడతామన్నారు.

కాకినాడలోని అశోక్‌ ఇంటర్నేషనల్‌ గోదాములో నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌

లక్షల మందికి అన్యాయం చేశారు

సామాన్యుడి పొట్ట కొట్టి అద్భుతంగా పాలిస్తున్నామని చెప్పుకొని లక్షల మందికి వైకాపా ప్రభుత్వం అన్యాయం చేసిందని నాదెండ్ల వ్యాఖ్యానించారు. కేజీ బియ్యానికి ప్రభుత్వం రూ.39 ఖర్చుచేసి.. పేదలకు రూపాయికి ఇస్తుంటే దళారులు రూ.8, రూ.10 ఇచ్చి కొనుక్కుంటున్నారని తెలిపారు. కాకినాడలో వ్యవస్థీకృత మాఫియా పోర్టును అడ్డాగా మార్చుకుని అవినీతికి పాల్పడుతోందన్నారు. రూ.కోట్ల ప్రజాధనాన్ని ఒక కుటుంబం కోసం ఎలా ఉపయోగించుకున్నారో అందరికీ తెలుసన్నారు.

నేనొస్తున్నానని తెలిసి నిల్వలు తరలించేశారు

కాకినాడ పోర్టు అంటే అందరూ భయపడుతున్నారని.. సొంతంగా నౌక ఏర్పాటుచేసుకునే స్థాయికి అక్రమార్కులు ఎదిగారంటే.. ఎంత బియ్యం ఆఫ్రికన్‌ దేశాలకు ఎగుమతి చేశారో అర్థంచేసుకోవచ్చని మంత్రి అన్నారు. ఇతర దేశాల్లో వీరికి ఖాతాలున్నాయని.. పలు రాష్ట్రాల నుంచి సరకు తెస్తున్నారని ఆరోపించారు. తన పర్యటన ఉందని తెలిసి మూడు, నాలుగు రోజులుగా చాలా నిల్వలు తరలించేశారని.. టోల్‌గేట్ల దగ్గర పదిరోజుల సీసీటీవీ ఫుటేజ్‌ తెప్పించుకుని అందరిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. క్రిమినల్‌ చర్యలు తీసుకునేందుకు సీఐడీని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించామన్నారు.

ధాన్యం సొమ్ము రూ.వెయ్యి కోట్లు ఖాతాల్లో వేస్తాం

వచ్చే సీజన్‌కల్లా ధాన్యం కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకుంటామని, పీడీఎస్‌ బియ్యం పంపిణీలో లోపాలు సరిదిద్దుతామని మంత్రి మనోహర్‌ తెలిపారు. రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లకు వివరిస్తే స్పందించి రూ.1,600 కోట్లలో రూ.వెయ్యి కోట్లు విడుదల చేస్తామని తెలిపారన్నారు. నాలుగైదు రోజుల్లో సొమ్ము ఖాతాల్లో పడుతుందని.. మిగిలిన రూ.600 కోట్లు నాబార్డ్, ఇతర బ్యాంకులతో మాట్లాడి విడుదలకు చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని