KTR: రాజ్యాంగానికి రాహుల్‌ తూట్లు

‘‘ఆరు గ్యారంటీలకు కాంగ్రెస్‌ నాయకులు మంగళం పాడి.. మా ఆరుగురు ఎమ్మెల్సీలను, ఏడుగురు ఎమ్మెల్యేలను వాళ్ల పార్టీలో చేర్చుకున్నారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి పాత్రధారి.. రాహుల్‌ గాంధీ సూత్రధారి.

Updated : 10 Jul 2024 03:54 IST

మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చట్టవిరుద్ధంగా కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు
ఫిరాయింపులపై హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
రాష్ట్రపతికి, ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేస్తాం
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌. చిత్రంలో దామోదర్‌రావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, హరీశ్‌రావు, వద్దిరాజు రవిచంద్ర

ఈనాడు, దిల్లీ: ‘‘ఆరు గ్యారంటీలకు కాంగ్రెస్‌ నాయకులు మంగళం పాడి.. మా ఆరుగురు ఎమ్మెల్సీలను, ఏడుగురు ఎమ్మెల్యేలను వాళ్ల పార్టీలో చేర్చుకున్నారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి పాత్రధారి.. రాహుల్‌ గాంధీ సూత్రధారి. రాజ్యాంగం చేత్తో పట్టుకొని తానే రాజ్యాంగ రక్షకుడినన్నట్లు చెబుతున్న రాహుల్‌.. అదే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. ఈ ద్విపాత్రాభినయానికి ఆయనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలి’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ దివాలాకోరుతనాన్ని జాతీయస్థాయిలో ఎండగట్టడానికి దిల్లీ వేదికగా పోరాటం చేయనున్నట్లు చెప్పారు. త్వరలో రాష్ట్రపతిని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్‌లను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. భావసారూప్య పార్టీలతో కలిసి దిల్లీ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తామన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఆటోమేటిక్‌గా వేటుపడేలా చేస్తామని తుక్కుగూడ సభలో విడుదల చేసిన న్యాయ్‌పత్రలో కాంగ్రెస్‌ ప్రకటించిందని, దాన్ని అమలు చేయాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్‌ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఇదివరకు సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. భారాస నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలన్న తమ ఫిర్యాదుపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోవడాన్ని హైకోర్టులో సవాల్‌ చేశామని, అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. మంగళవారం ఇక్కడ మాజీ మంత్రి హరీశ్‌రావు, భారాస పార్లమెంటరీ పార్టీనేత కేఆర్‌ సురేశ్‌రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావులతో కలిసి విలేకరుల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. 

అధిష్ఠానం అనుమతితోనే..

‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీకొచ్చి పార్టీ అధిష్ఠానం అనుమతి తీసుకొని మరీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. న్యాయ్‌పత్ర పేరుతో తుక్కుగూడలో విడుదల చేసిన మ్యానిఫెస్టోకు విరుద్ధంగా ఆ వేదికపైనే భారాస నుంచి గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలను రాహుల్‌ కూర్చోబెట్టుకున్నారు. రాజ్యాంగాన్ని మోదీ నాశనం చేస్తున్నారని, తానే కాపాడుతున్నానంటూ పార్లమెంటులో రాజ్యాంగం పట్టుకున్న ఆయన.. రెండు కిలోమీటర్ల దూరంలోని ఏఐసీసీ కార్యాలయంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. తెలంగాణలోని ఫిరాయింపుల అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తాం’’ అని కేటీఆర్‌ అన్నారు. ప్రధానిని కూడా కలుస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘‘ఆ ఆలోచన మాకు లేదు. రాజ్యాంగ రక్షకులను కలిసి మాకు జరుగుతున్న అన్యాయాన్ని చెబుతాం’’ అని అన్నారు. గతంలో తెదేపా, కాంగ్రెస్‌ల నుంచి గెలిచిన తలసాని, సబితలు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండానే.. మంత్రి పదవులు ఇచ్చారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘విలీనానికి, ఫిరాయింపులకు వ్యత్యాసం తెలుసుకోవాలి. కాంగ్రెస్‌కు చెందిన 18 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది, తెదేపాకు చెందిన 15 మందిలో 10 మంది, బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరూ అప్పట్లో తెరాసలో చేరారు. ఇప్పుడు భారాసకున్న 38 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు మాత్రమే కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. ఒకేసారి 26 మంది చేరితే.. అది విలీనం కిందికి వస్తుంది. ఒక్కొక్కరుగా పోతే అది ఫిరాయింపు కిందికే వస్తుంది’’ అని పేర్కొన్నారు. తెదేపా విలీనం కాకముందే తలసానికి మంత్రి పదవి ఇచ్చారు కదా? అన్న ప్రశ్నకు ఆయన రాజీనామా చేశారని బదులిచ్చారు. ‘‘మాకున్న 38 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురిని కాంగ్రెస్‌ కొనుగోలు చేసిందా? సామదానభేద దండోపాయాలు ప్రయోగించిందా? అన్నది వారే చెప్పాలి. ఆ పార్టీకి ఉన్న 99 మంది ఎంపీల్లో 20-30 మంది మరో పార్టీలో చేరితే కాంగ్రెస్‌ అంగీకరిస్తుందా?’’ అని అన్నారు. ‘‘తెలంగాణలో ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్‌. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో తెరాస (ప్రస్తుత భారాస)కు చెందిన 26 మంది ఎమ్మెల్యేల్లో 10 మందిని తీసుకెళ్లారు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని