Lok Sabha: హిందువుల పేరుతో హింసను ప్రోత్సహిస్తున్న భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌

హిందువులమని చెప్పుకొనేవారు నిత్యం హింసను ప్రోత్సహిస్తున్నారని, విద్వేషాలను రెచ్చగొడుతున్నారని లోక్‌సభలో సోమవారం ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.

Published : 02 Jul 2024 03:33 IST

లోక్‌సభలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలతో దుమారం
మోదీ, అమిత్‌షా అభ్యంతరం
ఆయన హిందూ సమాజాన్నంతటినీ కించపరిచారన్న భాజపా
అందరినీ అనలేదన్న ప్రతిపక్ష నేత
నీట్‌పై విపక్షం వాకౌట్‌

దిల్లీ: హిందువులమని చెప్పుకొనేవారు నిత్యం హింసను ప్రోత్సహిస్తున్నారని, విద్వేషాలను రెచ్చగొడుతున్నారని లోక్‌సభలో సోమవారం ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. మొత్తం హిందూ సమాజాన్ని ఆయన అవమానించారని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా పలువురు భాజపా సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేయగా.. తాను అందరినీ అనలేదని, భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ ముసుగులో హింసకు పాల్పడుతున్న వారిని ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యానించానని రాహుల్‌ వివరణ ఇచ్చారు. హిందూ సమాజమంతా హింసాత్మక ధోరణితో ఉంటుందని రాహుల్‌ వ్యాఖ్యానించారని, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా సభలో కొన్ని మతపరమైన ఫొటోలను రాహుల్‌ చూపించారు. దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్‌ ఓం బిర్లా వారించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ వివాదం చోటుచేసుకుంది. హిందువులను హింసావాదులుగా రాహుల్‌ పేర్కొనడం ఆమోదనీయం కాదని ప్రధాని స్పష్టంచేశారు. విపక్ష నేత క్షమాపణలు చెప్పాలని అమిత్‌ షా డిమాండు చేశారు.

అహింస, ధైర్యమే అన్ని మతాల సారం

హిందూ మతంలోని సారం అహింస, ధైర్యమేనని రాహుల్‌ పేర్కొన్నారు. మిగిలిన మతాల సారమూ ఇదేనని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఆయన మహా శివుడి చిత్ర పటాన్ని సభలో ప్రదర్శించారు. ‘అన్ని మతాలతోపాటు మన గొప్ప నాయకులంతా అహింస, ధైర్యం గురించే చెప్పేవారు. కానీ తమకు తాము హిందువులమని చెప్పుకొనేవారు హింస, విద్వేషం గురించి మాట్లాడుతున్నారు. అలాంటి మీరు హిందువుల కాదు’ అని భాజపా సభ్యులనుద్దేశించి రాహుల్‌ వ్యాఖ్యానించారు. దీంతో అధికార పక్ష సభ్యులు లేచి నిల్చుని నిరసన తెలిపారు. అమిత్‌ షా జోక్యం చేసుకుని.. ఎమర్జెన్సీ, 1984 అల్లర్లకు కారణమైన కాంగ్రెస్‌ తరఫున హింస గురించి మాట్లాడే అర్హత రాహుల్‌కు లేదని విమర్శించారు. దేశంలో ఉగ్రవాదానికి ఆ పార్టీయే కారణమని ధ్వజమెత్తారు. రాహుల్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ఇస్లాం, క్రైస్తవం, బుద్ధిజం, జైనిజం, సిక్కిజం.. అన్ని మతాలూ ధైర్యం గొప్పదనాన్ని వివరించాయని తెలిపారు. 

రాజ్యాంగాన్ని రక్షించుకున్నారు

భారత్‌ అనే భావన, రాజ్యాంగంతోపాటు భాజపా ఆలోచనలను ప్రతిఘటించిన లక్షలాది మందిపై గత పదేళ్లలో క్రమ పద్ధతిలో దాడి జరిగిందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. తానూ బాధితుడినేనని.. తనపై 20కిపైగా కేసులు మోపారని చెప్పారు. ‘నాకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. నా ఇల్లు తీసేసుకున్నారు. ఈడీ ఆధ్వర్యంలో 55 గంటలపాటు విచారణ ఎదుర్కొన్నా’ అని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందని పేర్కొంటూ.. అధికారంలో కంటే ఇదే ఎక్కువ విలువైనదని, ఇందులో ‘సత్యం’ ఉందని తెలిపారు. 

‘నీట్‌’ను కమర్షియల్‌గా మార్చేశారు

 ‘రాష్ట్రపతి ప్రసంగంలో నీట్, అగ్నివీర్‌ల ప్రస్తావన లేదు. ప్రొఫెషనల్‌ పరీక్ష అయిన ‘నీట్‌’ను కమర్షియల్‌గా మార్చారు. గతంలో తీసుకొచ్చిన రైతు చట్టాలవల్ల 700 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. వారికి సంతాపంగా సభలో మౌనం కూడా పాటించలేదు’ అని రాహుల్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మణిపుర్‌ను అంతర్యుద్ధంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. నీట్‌పై ప్రత్యేకంగా ఒక రోజు చర్చించాలని లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వాకౌట్‌ చేశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైనే చర్చ జరుగుతున్నందున నీట్‌పై చర్చకు అవకాశం లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని