Peddireddy: పుంగనూరులో పెద్దిరెడ్డికి షాక్‌

వైకాపా కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గం పుంగనూరులో భారీ షాక్‌ తగిలింది.

Published : 28 Jun 2024 04:31 IST

వైకాపాకు మున్సిపల్‌ ఛైర్మన్‌తోపాటు 13 మంది కౌన్సిలర్ల రాజీనామా

రొంపిచెర్లలో తెదేపా ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఇంటి వద్ద మున్సిపల్‌ ఛైర్మన్‌ అలీంబాషా, కౌన్సిలర్లు

రొంపిచెర్ల, పుంగనూరు, న్యూస్‌టుడే: వైకాపా కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గం పుంగనూరులో భారీ షాక్‌ తగిలింది. పుంగనూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ అలీంబాషా, మరో 12 మంది కౌన్సిలర్లు వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి.. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి (బాబు)ని గురువారం రొంపిచెర్లలోని ఆయన స్వగృహంలో కలిశారు. వీరు త్వరలో పార్టీ అధినాయకుల సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్లో తెదేపా తరఫున ఎవరూ నామినేషన్లు వేయకుండా, ఒకవేళ దాఖలు చేసినా వాటిని అధికారులు తిరస్కరించేలా పెద్దిరెడ్డి మంత్రాంగం నడిపారు. ఇప్పుడు వారే ఆయనపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఛైర్మన్‌ అలీంబాషా, కౌన్సిలర్లు అమ్ము, మనోహర్‌లు మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి తమకు పదవులు మాత్రమే ఇచ్చి పెత్తనమంతా ఆయనే చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, చల్లా రామచంద్రారెడ్డిలతో కలిసి పనిచేసి తమ వార్డులను అభివృద్ధి చేసుకుంటామని పేర్కొన్నారు. పుంగనూరు పరిధిలో మొత్తం 31 మంది వార్డు కౌన్సిలర్లుండగా, ప్రస్తుతం 13 మంది వైకాపాకు రాజీనామా చేశారు. చల్లా రామచంద్రారెడ్డిని కలిసిన వారిలో మున్సిపల్‌ ఛైర్మన్‌ అలీంబాషా, కౌన్సిలర్లు రామకృష్ణరాజు, రహంతుల్లా (జిల్లా వక్ఫ్‌ బోర్డు మాజీ అధ్యక్షుడు), జె.నరసింహులు, యువకుమారి, మమత, వి.కాళీదాస్‌మొదలియార్, ఖాన్‌ నూర్జహాన్, కసురున్నీసా, మనోహర్, హర్షద్‌అలీ, రేష్మా, మహ్మద్‌గౌస్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని