NEET Results: ఒకే సెంటర్‌లో ఆరుగురికి ఫస్ట్‌ ర్యాంక్‌.. దర్యాప్తు చేయాల్సిందే: ప్రియాంక

NEET Results| నీట్‌ -2024 ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్‌ చేశారు.

Updated : 07 Jun 2024 17:10 IST

దిల్లీ: నీట్-2024 (NEET UG 2024 Results) ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆరోపించారు. దీనిపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తొలుత నీట్‌ ప్రశ్నాపత్రం లీకైందన్న ఆమె... ఇప్పుడు ఫలితాల్లోనూ కుంభకోణం జరిగినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు.  ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ఆమె చెప్పారు. వీటన్నింటినీ నివృత్తి చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

మరోవైపు నీట్‌ ఫలితాల వెల్లడి తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంపై ప్రియాంక దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నీట్‌ పేపర్‌ లీకేజీ ఆరోపణలపై అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. ‘‘ లక్షలాది మంది విద్యార్థుల గోడును ఈ ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోంది. నీట్‌ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పదేపదే మొత్తుకుంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. దర్యాప్తు చేపట్టి వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?’’ అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.

నీట్‌ పరీక్ష ఫలితాలపై పలువురు అభ్యర్థులు, తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. జూన్‌ 4న వెలువడిన నీట్‌ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మందికి ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది. అందులో ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురికి 720కి 720 మార్కులు రావడం గమనార్హం. మరోవైపు నీట్‌ పరీక్ష పేపర్‌ లీకైనట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే, దీనిని తప్పుడు ప్రచారంగా ఎన్‌టీఏ కొట్టి పారేసింది. మే 5న సాయంత్రం 4 గంటల సమయంలో ప్రశ్నపత్రం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ సమయానికే దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్ష మొదలైపోయిందని, అందువల్ల ప్రశ్నపత్రం లీక్‌ కాలేదని క్లారిటీ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని