Punganur: పుంగనూరులో ఉద్రిక్తత

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటన నేపథ్యంలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Published : 01 Jul 2024 04:58 IST

ఎంపీ పర్యటన నేపథ్యంలో కూటమి నిరసనలు
మిథున్‌రెడ్డిని గృహనిర్బంధం చేసిన పోలీసులు

అంబేడ్కర్‌ కూడలిలో నిరసన తెలుపుతున్న కూటమి నాయకులు, కార్యకర్తలు

పుంగనూరు, న్యూస్‌టుడే: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటన నేపథ్యంలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన వస్తున్నారని తెలిసి కూటమి నాయకులు, కార్యకర్తలు స్థానిక అంబేడ్కర్‌ కూడలికి పెద్దఎత్తున చేరుకున్నారు. అక్కడే జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు, కార్యకర్తలతో స్థానికంగా ఎంపీ సమావేశం కావాల్సి ఉండగా శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ను తిరుపతిలోనే పోలీసులు గృహనిర్బంధం చేశారు. తెదేపా పుంగనూరు అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అక్రమ కేసులతో ఇబ్బందులు పడిన తెదేపా కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా ఎంపీని అడ్డుకొంటామని ముందుకొచ్చారన్నారు. నాడు అధికారం ఉందని తెదేపా శ్రేణులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ తదితర కేసులు బనాయించారని ఆయన విమర్శించారు. గతంలో తెదేపా అధినేత చంద్రబాబును కుప్పంలో, చల్లా రామచంద్రారెడ్డిని పుంగనూరు నియోజకవర్గంలో అడ్డుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ఎంపీ పర్యటన నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి హింసాత్మక ఘటనలూ జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులను పెద్దఎత్తున మోహరించారు. ప్రధాన కూడళ్లతోపాటు పట్టణ సరిహద్దులోనూ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి నోటీసు అందజేస్తున్న  ఏఎస్పీ కులశేఖర్‌


శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

-పోలీసుల సూచన 

పుంగనూరు నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఎలాంటి సమావేశాలు, సభలు నిర్వహించేందుకు వెళ్లకూడదని, నియోజకవర్గంలో పర్యటనను విరమించుకోవాలని ఎంపీ మిథున్‌రెడ్డికి పోలీసులు సూచించారు. తిరుపతిలోని తన నివాసం నుంచి బయల్దేరేందుకు యత్నించిన ఎంపీకి తిరుపతి ఏఎస్పీ కులశేఖర్‌ నేతృత్వంలో సీఐలు మహేశ్వర్‌రెడ్డి, మురళీమోహన్‌లు నోటీసులు జారీచేశారు. తదుపరి ఆదేశాలు వెలువడేవరకు ఇల్లు దాటి వెళ్లకూడదని స్పష్టం చేశారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సైతం ఆంక్షల వివరాలను పోలీసులు తెలియజేశారు. ఎంపీ నివాసానికి చేరుకోవడానికి యత్నించిన వైకాపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. 


స్పీకరు దృష్టికి తీసుకువెళ్తా

-మిథున్‌రెడ్డి 

ఈ పరిణామాలపై ఎంపీ మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం వైకాపా కార్యకర్తలపై తెదేపా భౌతిక దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు గృహనిర్బంధం చేశారని, ఈ విషయాన్ని పార్లమెంట్‌ స్పీకర్‌ దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని సంస్కృతిని తెదేపా నాయకులు అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని