Chandrababu: 1995 నాటి చంద్రబాబును చూస్తారు

‘కొత్త శకానికి, నూతన సంస్కృతికి అందరూ అలవాటు పడాలి. అధికారులు పాత రోజులు మరిచిపోయి కొత్త ఆలోచనతో ముందుకు వెళ్లాలి. పరదాలు ఎక్కడైనా కడితే ఇక ఉపేక్షించను. సస్పెండ్‌ చేస్తా.

Updated : 02 Jul 2024 05:10 IST

తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టను
అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఇది వర్తిస్తుంది
పెనుమాక ప్రజావేదికలో సీఎం

ఈనాడు, అమరావతి: ‘కొత్త శకానికి, నూతన సంస్కృతికి అందరూ అలవాటు పడాలి. అధికారులు పాత రోజులు మరిచిపోయి కొత్త ఆలోచనతో ముందుకు వెళ్లాలి. పరదాలు ఎక్కడైనా కడితే ఇక ఉపేక్షించను. సస్పెండ్‌ చేస్తా. ఇప్పటి వరకు రివర్స్‌లో వెళుతున్న బండిని ఇప్పుడు ముందుకు తీసుకెళుతున్నాం. ఇక వేగంగా వెళ్లడమే. 4.0....1995 నాటి సీబీఎన్‌ను చూస్తారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ‘అప్పట్లో హైదరాబాద్‌ నుంచి బయలుదేరుతుంటే రాష్ట్రం మొత్తం రెడ్‌ అలర్ట్‌ ఉండేది. ఇప్పుడు అలా చేయను కానీ....తప్పు చేస్తే మాత్రం ఎవరినీ వదిలిపెట్టను. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఇది వర్తిస్తుంది’ అని స్పష్టం చేశారు. ‘ప్రజలిచ్చిన ఈ గౌరవాన్ని వారి కోసమే వినియోగిస్తా. నా స్వార్థం కోసం ఉపయోగించను. సమర్థవంతమైన పాలన అందిస్తా. గత ఎన్నికల్లో ప్రజలు సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. వారికి సర్వదా కృతజ్ఞుడిగా ఉంటా’ అని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెనుమాకలో సోమవారం నిర్వహించిన ప్రజావేదికలో చంద్రబాబు పింఛనుదారులు, గ్రామస్థులతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమం ఆద్యంతం పండుగ వాతావరణంలో సాగింది. పలువురు మహిళలు తమ సమస్యలు విన్నవిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ మంగళగిరి నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వాటన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిచ్చారు.

అత్యాచారం చేస్తే అదే చివరి రోజు....

‘ఎవరైనా సరే ఆడబిడ్డలపై విచ్చలవిడిగా వ్యవహరిస్తే వదిలిపెట్టను. అత్యాచారం చేస్తే అదే వారికి చివరి రోజు. ప్రభుత్వమంటే ఎవరూ తమాషాగా తీసుకోవద్దు. సంఘ విద్రోహ శక్తులను నిర్మొహమాటంగా అణచివేస్తా. మద్యం, గంజాయి మత్తులో ఇష్టానుసారం వ్యవహరిస్తే తీవ్ర చర్యలుంటాయి. మహిళలకు అన్యాయం జరిగితే ఉపేక్షించను. ఇకపై చేతల్లో కూడా అది చూస్తారు’ అని హెచ్చరించారు.

‘రాజధానిని ఆదర్శంగా చేయాలంటే అందరి సహకారం అవసరం. రాజధాని ప్రాంతంలో అభివృద్ధిని అడ్డుకునేలా కోర్టుకు వెళ్లడం మంచి విధానం కాదు. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పాలి. ఏ ప్రాజెక్టు కట్టినా దానికి భూములిచ్చిన రైతులు సంతోషంగా ఉండేలా పరిహారం అందించి దాన్ని పూర్తి చేసిన ఘనత తెదేపాది. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నాం. అమరావతిలోనూ అదే చేస్తా’ అని సీఎం పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని