KCR: కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో విరక్తి

అధికారంలోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు తీవ్ర విరక్తి చెందారని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

Updated : 04 Jul 2024 12:23 IST

సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్‌. చిత్రంలో ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మధుసూదనాచారి 

ఈనాడు, హైదరాబాద్‌: అధికారంలోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు తీవ్ర విరక్తి చెందారని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తన చేష్టలతో తానే ప్రజల చేత ఛీకొట్టించుకోవడమే కాంగ్రెస్‌ పార్టీ వైఖరి అని, ఈ విషయం మన కళ్ల ముందు కనిపిస్తోందని విమర్శించారు. శత్రువులు, ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ.. అప్రతిహతంగా సాగుతున్న భారాస విజయ ప్రస్థానంలో ఇటీవల ఓటమితో దిష్టి తీసినట్లయిందని చెప్పారు. గెలుపు, ఓటములకు అతీతంగా భారాసకు తెలంగాణ సమాజం ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని కేసీఆర్‌ అన్నారు. పునరుత్తేజంతో మరింత ప్రజాదరణ కూడగట్టాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసంలో మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్‌ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక.. పలు రకాల గిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకొంటోంది. కాంగ్రెస్‌ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు.. ఓటేసి పొరపాటు చేశామని అనుకుంటున్నారు. నాపై ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో, ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వారు తిరగబడే రోజులు త్వరలోనే రానున్నాయి. మరికొద్ది రోజుల్లోనే టార్చ్‌లైట్‌ పట్టుకొని వెతుక్కుంటూ భారాస కోసం జనం వస్తారు. అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపై పోరాడుతూ.. వారికి అందుబాటులో ఉండాలి. రెండున్నర దశాబ్దాల ప్రస్థానంలో తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులను తట్టుకుని నిలబడ్డ పార్టీకి.. నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదు. ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ మరింత ప్రజాదరణ పొందుతూ ముందడుగు వేస్తుంది’’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎ.జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతారెడ్డి, నలమోతు భాస్కర్‌రావు, రమావత్‌ రవీంద్రకుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్, బూడిద బిక్షమయ్యగౌడ్, కంచర్ల కృష్ణారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తనను కలిసేందుకు ముందస్తు సమాచారంతోనే రావాలని కార్యకర్తలకు, అభిమానులకు కేసీఆర్‌ మరోసారి విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని