Payyavula Keshav: జగన్‌ ప్రతిపక్ష నేత కాదు.. వైకాపా ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమే: మంత్రి పయ్యావుల

వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రతిపక్ష నేత కాదని.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమేనని ఏపీ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.

Updated : 26 Jun 2024 15:25 IST

అమరావతి: వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రతిపక్ష నేత కాదని.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమేనని ఏపీ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడికి జగన్‌ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అమరావతిలో మీడియాతో పయ్యావుల మాట్లాడారు. 

ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు. ఆ హోదా రావడానికి ఆయనకు ఓ పదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్‌కు ఆప్తుడైన కేసీఆర్‌ కూడా గతంలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. స్పీకర్‌కు జగన్‌ లేఖ రాసి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో ఆయన లేఖ రాయడమేంటని నిలదీశారు.

అసెంబ్లీ రూల్‌ బుక్‌ చదవాలి

‘‘ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్‌ గుర్తించలేనట్టుంది. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని నిర్ణయించారు. ఆ హోదాపై నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అధికార పార్టీగా మేం హుందాగానే స్పందించి మంత్రులతో పాటు ప్రమాణం చేయించాం. దేశవ్యాప్తంగా అన్ని శాసన సభలు, పార్లమెంట్‌లో పాటించే నిబంధనలను జగన్ తెలుసుకోవాలి. ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ సలహాదారు సూచనల మేరకే రాశారా? ఆ సలహాలు తీసుకుంటే మునిగిపోతారు. మద్యం, ఇసుక ఖాతాల పుస్తకాలే కాదు.. శాసనసభ, పార్లమెంటరీ నిబంధనలు ఉండే కౌల్‌ అండ్‌ షఖ్దర్‌ పుస్తకం, అసెంబ్లీ రూల్‌ బుక్‌ చదవాలి. ఓనమాలు కూడా చూసుకోకుండా మీతో ఈ లేఖ రాయించారు. 10 శాతం సభ్యులు కూడా లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? 

అప్పుడు మీ నోటితో మీరే చెప్పారుగా?

మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చిటికేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉండదన్నారు.. ఏమైంది? శాసనసభ సాక్షిగా మీ నోటితో మీరే చెప్పారు కదా? మళ్లీ ఇప్పుడు 10 శాతం నిబంధన లేదు.. తూచ్‌ అంటారా? ప్రజలు అధికారం తీసేసినా కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్లుంది. ప్రతిపక్ష హోదాతో క్యాబినెట్‌ ర్యాంకు  వస్తుంది.. దానితో జులుం చేయొచ్చనుకుంటున్నారేమో! ఆ ధోరణి మార్చుకోండి. ఇప్పుడైనా ప్రజల గురించి ఆలోచించండి. సభలో మీరు మాట్లాడాలనుకుంటే.. అందరి సభ్యుల్లాగే మీకూ మాట్లాడే హక్కు ఉంటుంది. పార్లమెంట్‌లో ఉపేంద్రను ఫ్లోర్‌ లీడర్‌గా పేర్కొన్నారు తప్ప.. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. 1994లో ప్రతిపక్ష నేతగా పీజేఆర్‌ లేరు. అప్పుడు సీఎల్పీ నేతగా విజయభాస్కర్‌రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌గా అప్పటి స్పీకర్‌ ఆయన్ను గుర్తించారు. బాబూరావు, పీజేఆర్‌ సీఎల్పీ ఉపనాయకులుగా ఉన్నారు. ఇవన్నీ రికార్డుల్లో ఉన్నాయి’’ అని పయ్యావుల అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని