Pawan Kalyan: జనసేన గెలుపు 5కోట్ల మంది ఆకాంక్షకు ప్రతిరూపం: పవన్‌

జనసేన గెలవడం ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Updated : 04 Jun 2024 21:10 IST

అమరావతి: జనసేన గెలవడం ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కార్యకర్తలనుద్దేశించి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇది కక్ష సాధింపుల సమయం కాదని.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి బలమైన పునాదులు వేసే సమయమని పార్టీ శ్రేణులకు చెప్పారు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదని.. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు గుర్తున్నాయన్నారు. పోటీ చేసి గెలిచింది 21 సీట్లలో అయినా 175 సీట్లలో గెలిపిస్తే ఎంత బాధ్యత ఉంటుందో అంతే బాధ్యతగా పనిచేస్తామన్నారు. 

‘‘ప్రజలకు జవాబుదారీతనం చెప్పే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుంది. జగన్‌తో నాకు వ్యక్తిగత కక్ష లేదు. కక్ష సాధింపు కోసం మనకి జనం అధికారం ఇవ్వలేదు. ఐదు కోట్ల ఆంధ్రులకు న్యాయం చేయాలి. నా జీవితం ఎప్పుడూ దెబ్బలు తినడమే. సినిమా పరంగా తొలిప్రేమ విజయం.. రాజకీయాల్లో ఈ విజయం. డబ్బు, పేరు కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. సగటు మనిషి కష్టం చూసి వచ్చా. 2019లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. గెలుపోటములను సమానంగా తీసుకుంటున్నా. ఆకాశమంత విజయాన్నిచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా. తెలుగుదేశం నేత వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు. పిఠాపురం ప్రజలు పవన్‌ను గెలిపించలేదు.. రాష్ట్రంలో ఐదు కోట్ల మందిని గెలిపించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలెబెట్టుకుంటాం’’ అని పవన్‌ స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని