Pawan Kalyan: నియోజకవర్గాల్లో జనవాణి చేపట్టండి: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

జనసేన శాసనసభ్యులకు సభా వ్యవహారాలు, నియమావళి, సంప్రదాయాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌  ప్రసంగించారు.

Updated : 25 Jun 2024 21:57 IST

విజయవాడ: ‘మనపై ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్నారు. భారీ మెజార్టీతో, 100శాతం స్ట్రైక్‌ రేట్‌తో గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను సభలో ప్రతిఫలింపచేద్దాం’’ అని పార్టీ ఎమ్మెల్యేలకు ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. జనసేన శాసనసభ్యులకు సభా వ్యవహారాలు, నియమావళి, సంప్రదాయాలపై మంగళవారం విజయవాడలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

‘‘పార్టీ నుంచి గెలిచిన వారిలో ఎక్కువ మంది శాసనసభ వ్యవహారాలకు కొత్తవారే. అందరం సభ నియమావళి, సంప్రదాయాలపై అవగాహన తెచ్చుకోవాలి. నియమావళిని పాటిస్తూ సంప్రదాయాలను గౌరవించాలి. సభలో హుందాగా ఉండాలి. మన నడవడిక, చర్చించే విధానం ప్రజల మన్ననలు పొందాలి. తొలి వంద రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వశాఖలు, పాలనాపరమైన విధివిధానాలు, పథకాలు, వాటి అమలు తీరు, సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా చేరుతున్నాయా?లేదా? వంటి విషయాలపై అధ్యయనం చేయాలి. ఆ తర్వాత మీరు చేసే చర్చలు ఎంతో బలంగా ఉంటాయి.

మర్యాదపూర్వకమైన భాష వాడాలి

విషయాన్ని చెప్పేటప్పుడు భావ తీవ్రత ఉండవచ్చు. భాష సరళంగా, మర్యాదపూర్వకంగా ఉండాలి. అధికారులు, ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు, చర్చల్లో పరుష పదజాలం వాడొద్దు. ప్రజలతో గౌరవంగా ఉంటూ వారు తమ బాధలు, సమస్యలు చెబితే జాగ్రత్తగా వినాలి.

నియోజకవర్గాల్లో జనవాణి చేపట్టండి

మన పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు అభినందన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమం అయిన తరవాత నియోజకవర్గ స్థాయిలో అభినందన కార్యక్రమాలు చేపట్టండి. మీ గెలుపు కోసం తోడ్పడిన కూటమి నాయకులు, మన పార్టీ నాయకులను అభినందించండి. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో నిస్వార్థంగా పని చేసిన జన సైనికులు, వీర మహిళలను, సభలు, కార్యక్రమాల్లో వాలంటీర్లుగా పని చేసిన వారిని గుర్తించండి. వారి కోసం ప్రత్యేకంగా కృతజ్ఞత కార్యక్రమాలు నిర్వహించాలి. వారితో గౌరవభావంతో ఉండాలి. మన పార్టీ శ్రేణులను బలోపేతం చేసే బాధ్యత మీపై ఉంది. ఇలాంటి అవగాహన చర్చలు ప్రతి నెల నిర్వహించుకుందాం. జనసేన పక్షాన చేసిన జనవాణి కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది. మీరు కూడా నియోజకవర్గ స్థాయిలో ప్రతి నెలా జనవాణి చేపట్టండి’’ అని పవన్‌ కల్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని