Pawan kalyan: ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా: పవన్‌

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో పర్యటించారు.

Updated : 01 Jul 2024 18:05 IST

పిఠాపురం: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో పర్యటించారు. గొల్లప్రోలులో జనసేన వీరమహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఇప్పుడు నేను కేవలం ఎమ్మెల్యేను మాత్రమే కాదు.. ఎన్డీయేకు అండగా నిలబడ్డ వ్యక్తిని. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉంటాం. పొట్టి శ్రీరాములు బలిదానం వల్లే మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. డొక్కా సీతమ్మ సేవల్ని మనమంతా నిత్యం స్మరించుకోవాలి. ఆమె పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి. సమాజానికి ఏదైనా ఇవ్వాలనే ఆలోచనతోనే నేను రాజకీయాల్లోకి వచ్చా. ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా. పిఠాపురం అభివృద్ధికి ఏం చేయగలనా అని నిత్యం ఆలోచిస్తున్నా. పిఠాపురాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తా. పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చాకే నన్ను ఊరేగించండి’’ అన్నారు.

‘‘కేంద్ర పథకం జల్‌ జీవన్‌ మిషన్‌ గురించి అధికారులతో మాట్లాడా. ఈ మిషన్‌కు కేంద్రం నుంచి బాగా నిధులు వస్తాయి. రాష్ట్ర వాటా ఇస్తే చాలు.. కేంద్రం నుంచి పూర్తిగా నిధులు వస్తాయి. కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖ పనులను గత పాలకులు విస్మరించారు. మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల్లో పనిచేసిన నా కోసం పనిచేశారు. ఏమిచ్చి జనసైనికుల రుణం తీర్చుకోగలను. నేను అనుకున్న ఆశయం కోసం మీరంతా చేతులు కలిపినందుకు ఎన్నిసార్లు శిరస్సు వంచి నమస్కరించినా ఆ కృతజ్ఞత సరిపోదు. అరాచక పాలన, దాష్టీకాలను ఎదురొడ్డి మరీ నిలబడ్డారు. మీరంతా జనసేనకు బలం ఇవ్వడం కాదు.. ఐదుకోట్ల మంది ప్రజలకు బలాన్నిచ్చారు. జనసేన నేతలు లేని ఊరుంటుందేమో నాకు తెలియదు గానీ.. జనసైనికులు, వీరమహిళలు లేని ఊరుండదు’’ అని పవన్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని