pinnelli arrest: పిన్నెల్లి అరెస్టుతో మాచర్ల ఊపిరి పీల్చుకుంటోంది

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత..నియోజకవర్గ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారని, ప్రశాంతంగా నిద్రపోతున్నారని పల్నాడు జిల్లా తెదేపా నేతలు తెలిపారు.

Published : 29 Jun 2024 06:15 IST

పల్నాడు జిల్లా తెదేపా నేతల హర్షం 

ఈనాడు డిజిటల్, అమరావతి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత..నియోజకవర్గ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారని, ప్రశాంతంగా నిద్రపోతున్నారని పల్నాడు జిల్లా తెదేపా నేతలు తెలిపారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, అరవిందబాబు, దివ్యాంగ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ జి.కోటేశ్వరరావు తదితరులు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారంటున్న వైకాపా వాళ్లు...గత ప్రభుత్వంలో పిన్నెల్లి సోదరులు చేసిన అక్రమాల్ని గుర్తుచేసుకోవాలని హితవుపలికారు. ‘‘పల్నాడులో అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, మైనింగ్‌ మాఫియా, ఇసుక తరలింపు ద్వారా వాళ్లు రూ.వేల కోట్లు దోచుకున్నారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నియంతల్లా వ్యవహరించారు. ఈ అరెస్టు ట్రయిలర్‌ మాత్రమే. త్వరలోనే పిన్నెల్లి సోదరుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు రానున్నాయి’’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ ‘‘చంద్రయ్య, జల్లయ్య, పెద్దకోటయ్య సహా అనేక మంది తెదేపా నాయకుల్ని హత్యలు చేయించారు’’ అని మండిపడ్డారు. పల్నాడులో వైకాపా నేతలకు కొమ్ముకాసిన అధికారులపైనా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని కూడా అరెస్టు చేయాలని జీవీ ఆంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని