Komatireddy venkat reddy: తెలంగాణకు రావాల్సిన నిధులు సాధించడమే మా లక్ష్యం: కోమటిరెడ్డి

కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Published : 26 Jun 2024 16:29 IST

దిల్లీ: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ రహదారుల ప్రాజెక్టుల విషయమై దిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘జాతీయ రహదారులకు సంబంధించి గత అయిదేళ్లలో తెలంగాణకు అతి తక్కువ నిధులు వచ్చాయి. భూసమీకరణ, ఇతర అంశాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దాంతో పనులు ఆగిపోయాయి. 2016లో ప్రకటించిన రీజినల్‌ రింగ్‌రోడ్డును మరిచిపోతే మా ప్రభుత్వం వచ్చిన తరువాత కదలిక తీసుకొచ్చాం. యుటిలిటీ ఛార్జీలను భరిస్తామని చెప్పాం. కేంద్రమంత్రి గడ్కరీ స్పందించి తామే భరిస్తామని భరోసా ఇచ్చారు. 50-50 షేరింగ్‌లో భూసమీకరణ ప్రారంభించాలని తాజా సమావేశంలో నిర్ణయించాం. 

రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరమైన 6 లేన్‌ గురించి కూడా చర్చించాం. రెండేళ్లలోపే విజయవాడ-హైదరాబాద్‌ మార్గాన్ని రూ.4వేల కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేయనున్నామని, ఏపీ విభజన చట్టం ప్రకారం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు రూపకల్పన చేస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. అన్ని వినతులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణకు రావాల్సిన నిధులన్నీ సాధించడమే మా లక్ష్యం. జవాబుదారీతనంగా పని చేయడం మాకు తెలుసు కాబట్టే ఇంత మంది మంత్రులం దిల్లీకి వచ్చి మాట్లాడుతున్నాం. ఉప్పల్‌-ఘట్‌కేసర్‌ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో వాటిని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని కోమటిరెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని