MLC Nomination: రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థుల నామినేషన్లు

ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో భాగంగా కూటమి అభ్యర్థులు సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్‌ మంగళవారం నామినేషన్లు సమర్పించారు.

Published : 03 Jul 2024 04:30 IST

వైకాపాలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చిన రామచంద్రయ్యకు మళ్లీ అవకాశమిచ్చిన తెదేపా
జనసేన నుంచి హరిప్రసాద్‌

ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్‌ సమర్పిస్తున్న పి.హరిప్రసాద్‌.. చిత్రంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మంత్రి నాదెండ్ల మనోహర్‌

ఈనాడు, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో భాగంగా కూటమి అభ్యర్థులు సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్‌ మంగళవారం నామినేషన్లు సమర్పించారు. రామచంద్రయ్యతోపాటు మంత్రులు పయ్యావుల కేశవ్, ఎన్‌ఎండీ ఫరూక్‌ తదితరులు.. హరిప్రసాద్‌తోపాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నామినేషన్‌ దాఖలు చేశాక అభ్యర్థులిద్దరూ విలేకరులతో మాట్లాడారు. ‘వైకాపా ప్రభుత్వ అరాచకాలను భరించలేకనే ఆ పార్టీ ద్వారా నాకు వచ్చిన ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉన్నప్పటికీ రాజీనామా చేశా. ఇప్పుడు మళ్లీ అదే ఎమ్మెల్సీగా చంద్రబాబు నాకు అవకాశమిచ్చారు’ అని రామచంద్రయ్య తెలిపారు. హరిప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘పాత్రికేయుడిగా పనిచేసిన నాకు రాష్ట్రంలోని ప్రజల సమస్యలపట్ల అవగాహన ఉంది. వాటి పరిష్కారానికి ఇప్పుడు ప్రజాప్రతినిధిగా సేవలందిస్తా. జనసేన ఇప్పుడు తొలిసారి శాసనమండలిలోకి అడుగుపెట్టనుంది’ అని చెప్పారు.


నామినేషన్‌ సమర్పిస్తున్న సి.రామచంద్రయ్య.. చిత్రంలో మంత్రి పయ్యావుల కేశవ్‌

చంద్రబాబును కలిసిన రామచంద్రయ్య

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన రామచంద్రయ్య సీఎం చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని