AIADMK: భాజపాతో పొత్తు లేదు.. విమర్శిస్తుంటే మేం సహించాలా?: జయకుమార్‌

‘అన్నా డీఎంకేతో భాజపా రాష్ట్ర చీఫ్‌ అన్నామలై పొత్తును కోరుకోవడంలేదు. కానీ ఆ పార్టీ శ్రేణులు కావాలనుకొంటున్నాయి. మా నేతలపై విమర్శలు చేస్తుంటే మేం సహించాలా?’ అని అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి జయకుమార్‌ అన్నారు.

Published : 18 Sep 2023 15:49 IST

చెన్నై: అన్నాడీఎంకే(AIADMK) సీనియర్‌ నేత, మాజీ మంత్రి జయకుమార్ సోమవారం చేసిన వ్యాఖ్యలతో భాజపా(BJP), అన్నాడీఎంకే పార్టీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు కనబడుతోంది. భాజపాతో తమకు ఎలాంటి పొత్తు లేదన్న జయకుమార్‌.. పొత్తుల అంశంపై ఏ నిర్ణయమైనా ఎన్నికల సమయంలో మాత్రమే తీసుకుంటామన్నారు.  ద్రవిడ మహా నేత సీఎన్‌ అన్నాదురైపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన విమర్శల పట్ల జయకుమార్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ నేత, దివంగత సీఎం అన్నాదురై పట్ల అవమానకరంగా మాట్లాడితే పార్టీ కార్యకర్తలు సహించరన్నారు.  దివంగత నేత జయలలితతో పాటు పలువురు అన్నాడీఎంకే నేతలపై అన్నామలై విమర్శలు చేయగా.. అదుపులో ఉండాలని తమ పార్టీ ఇప్పటికే  కోరిందన్నారు. 

విషయం లేనోళ్లను విశ్వసిస్తే.. వినాశనం గ్యారెంటీ: కేటీఆర్‌

సోమవారం చెన్నైలో జయకుమార్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘అన్నా డీఎంకేతో అన్నామలై పొత్తును కోరుకోవడంలేదు. కానీ ఆ పార్టీ శ్రేణులు కావాలనుకొంటున్నాయి. మా నేతలపై విమర్శలు చేస్తుంటే మేం సహించాలా?  భాజపాను మేం ఎందుకు మోయాలి.  భాజపా ఇక్కడ అడుగు పెట్టలేదు.  మీ ఓటు బ్యాంకు తెలుసు’’ అన్నారు. అన్నాడీఎంకే వల్లే తమిళనాట భాజపా ఎంతో కొంత ఉందన్నట్టుగా జయకుమార్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ‘‘ఇకపై మీ(భాజపా నేతల) విమర్శల్ని మేం సహించలేం. మీతో పొత్తు కూడా లేదు. భాజపా అన్నాడీఎంకేతో లేదు. పొత్తు విషయం ఎన్నికల సమయంలో మాత్రమే నిర్ణయమవుతుంది. ఇదే మా వైఖరి’’ అని తేల్చి చెప్పారు.  అయితే, ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా? అని విలేకర్లు ప్రశ్నించగా.. ‘ఆ హోదాలో నేను మీతో ఎప్పుడైనా మాట్లాడానా? మా పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో అది మాత్రమే మాట్లాడతాను’’ అని జయకుమార్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని