Nadendla Manohar: రేషన్‌ వాహనాలతో రూ. 1,500 కోట్ల నష్టం: మంత్రి నాదెండ్ల మనోహర్‌

రేషన్‌ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండీయూ (మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) వాహనాల నిర్వాహకులేనని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ధ్వజమెత్తారు.

Updated : 05 Jul 2024 06:50 IST

రైతులకు ధాన్యం బకాయిలు రూ. 1,000 కోట్ల విడుదల 

ఈనాడు, అమరావతి: రేషన్‌ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండీయూ (మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) వాహనాల నిర్వాహకులేనని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ధ్వజమెత్తారు. గత వైకాపా ప్రభుత్వం గడప వద్దకే రేషన్‌ పేరుతో 9,260 వాహనాలు కొనుగోలు చేసి, పౌరసరఫరాల సంస్థకు రూ. 1,500 కోట్ల నష్టం కలిగించిందని పేర్కొన్నారు. ఎండీయూల ద్వారా రేషన్‌ పంపిణీపై చర్చించి, త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. రబీలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ. 1,000 కోట్లను ఆయన విజయవాడలోని పౌరసరఫరాల సంస్థ కమిషనరేట్‌లో గురువారం విడుదల చేశారు. గత వైకాపా ప్రభుత్వం రూ. 1,659 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించకుండా రైతుల్ని మోసం చేసిందన్నారు. వైకాపా పాలనలో పౌరసరఫరాల సంస్థ అప్పులు రూ. 36,300 కోట్లకు చేరాయని, అందులో రూ. 10,000 కోట్లను వచ్చే ఏడాది మార్చిలోగా తీర్చాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక బ్యాంకులకు రూ. 2,000 కోట్లు చెల్లించామని చెప్పారు. రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఖాళీ గోతాలకు చెల్లింపులు నిలిపివేశామని.. దీనిపై అధ్యయనం చేస్తున్నామన్నారు. రేషన్‌ బియ్యం మాఫియాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబ అవినీతి భారీగా ఉందని మనోహర్‌ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కాకినాడ పోర్టును అక్రమ బియ్యం ఎగుమతులకు అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌ మాఫియాను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టుకు సమీపంలో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో రూ. 159 కోట్ల విలువైన 35,404 టన్నుల బియ్యాన్ని సీజ్‌ చేశామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని