Pulivendula: పులివెందుల వైకాపాలో పెండింగ్‌ బిల్లుల పంచాయితీ!

వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పెండింగ్‌ బిల్లులపై వైకాపా నాయకుల పంచాయితీ కొనసాగుతూనే ఉంది.

Updated : 30 Jun 2024 06:43 IST

ప్రశ్నించిన నాయకులపై ఇటీవల జగన్‌ నిష్ఠూరం
పార్టీకి రాజీనామా చేస్తామని కౌన్సిలర్ల సంకేతాలు
వారికి ఎంపీ అవినాష్‌రెడ్డి సముదాయింపు

వైకాపా కౌన్సిలర్లతో మాట్లాడుతున్న ఎంపీ అవినాష్‌రెడ్డి

ఈనాడు, కడప: వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పెండింగ్‌ బిల్లులపై వైకాపా నాయకుల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల పులివెందుల వచ్చిన జగన్‌ దంపతుల వద్ద వారంతా పెండింగ్‌ బిల్లుల ప్రస్తావన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాము వైకాపాను నమ్ముకుని అప్పులు చేసి కాంట్రాక్టు పనులు చేశామని, బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. కోర్టుకెళ్లయినా బిల్లులు రాబడతామని జగన్‌ అభయమిచ్చే ప్రయత్నం చేసినా.. వారు సంతృప్తి చెందలేదు. తాను రాజకీయాలు చేస్తున్నదే మీ కోసమని, మీరే ఇలా మాట్లాడితే ఎలా అంటూ జగన్‌ వారిని ప్రశ్నించారు. నేను, నా కుటుంబం ఇంతగా మాటలు పడాల్సిన పని లేదంటూ నిష్ఠూరంగా మాట్లాడిన విషయం అప్పట్లో వెలుగు చూసింది. నేనైతే అడిగినంతగా నిధులు నియోజకవర్గానికి ఇస్తూ వచ్చానని.. ఇప్పుడు మళ్లీ రూ.650 కోట్ల బిల్లులు పెండింగ్‌ ఉన్నాయంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలంటూ జగన్‌ వారిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు దిక్కెవరంటూ నాయకులు ప్రస్తావించగా, ఎంపీ అవినాష్‌రెడ్డి ఉన్నాడుగా అంటూ సమాధానమిచ్చి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాము పార్టీని నమ్ముకుని తీవ్రంగా నష్టపోయామని, అందరికీ బిల్లులిచ్చి తమకే మోసం చేశారంటూ పలువురు కౌన్సిలర్లు అసమ్మతి గళమెత్తారు. పార్టీకి రాజీనామా చేస్తామనే సంకేతాలిచ్చారు. ఈ తరుణంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి శనివారం కౌన్సిలర్లతో భేటీ అయ్యారు. పాడా కింద రూ.250 కోట్లు, ఇతరత్రా విభాగాల కింద మరో రూ.400 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు వారు ఆయన వద్ద ప్రస్తావించారు. పెండింగ్‌ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వరకు వేచి చూద్దామని, లేదంటే కోర్టును ఆశ్రయిద్దామని అవినాష్‌ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. జగనన్న అండగా ఉన్నారు.. మీరంతా ధైర్యంగా పార్టీని అంటిపెట్టుకొని ఉండాలని ఎంపీ సూచించారు. కోర్టుకెళ్లి బిల్లులు పొందటం ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా అంటూ పలువురు నాయకులు, కౌన్సిలర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని