Lalu Prasad Yadav: మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ

కేంద్రంలోని మోదీ సర్కారు బలహీనంగా ఉందని, అది నెల రోజుల్లోపే కూలిపోయే అవకాశం ఉందని ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

Published : 06 Jul 2024 00:04 IST

పట్నా: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వంపై ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కారు బలహీనంగా ఉందని, అది నెల రోజుల్లోపే కూలిపోయే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఆర్జేడీని స్థాపించి 28 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాలూ ఈమేరకు ప్రసంగించారు.

‘‘మోదీ ప్రభుత్వం బలహీనంగా ఉంది. ఏ క్షణమైనా కూలిపోవచ్చు. ఆగస్టులో పతనమయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని పార్టీ శ్రేణులకు లాలూ సూచించారు. అయిదేళ్ల క్రితంతో పోలిస్తే ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ.. సీట్ల సంఖ్యను, ఓట్ల శాతాన్ని పెంచుకుందన్నారు. ‘‘కొంత కాలంగా బిహార్ అసెంబ్లీలో ఆర్జేడీ ఏకైక అతిపెద్ద పార్టీగా ఉంది. ఇతరుల మాదిరిగా కాకుండా.. మా సిద్ధాంతాలతో మేం ఎన్నడూ రాజీపడలేదు’’ అని తెలిపారు.

అందుకే బిహార్‌లో వరుసగా బ్రిడ్జ్‌లు కూలుతున్నాయట!

లాలూ వ్యాఖ్యలను భాజపా ఖండించింది. ఆయన పగటి కలలు కంటున్నారని కేంద్ర మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికలు మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసాన్ని మరోసారి చాటిచెప్పాయన్నారు. మోదీ మార్గనిర్దేశంలో, సీఎం నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలో బిహార్‌లో ఎన్డీయే కూటమి.. ప్రతిపక్షాలను ఓడిస్తుందన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సైతం ఎన్డీయే ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని