Jeevan Reddy: జీవన్‌రెడ్డి నారాజ్‌

జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్‌కుమార్‌ ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలియడంతో జగిత్యాలలోని నివాసానికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.

Updated : 25 Jun 2024 07:10 IST

జగిత్యాల ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై మనస్తాపం
ఇంకా తనకు పార్టీ, పదవి ఎందుకని అనుచరులతో వ్యాఖ్య
నచ్చజెప్పేందుకు రంగంలోకి దిగిన మంత్రి శ్రీధర్‌బాబు

జీవన్‌రెడ్డితో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ పార్టీ కోరుట్ల ఇన్‌ఛార్జి నర్సింగరావు, విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్‌కుమార్‌ ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలియడంతో జగిత్యాలలోని నివాసానికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. జీవన్‌రెడ్డి మనస్తాపం చెందినట్లు తెలియడంతో సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు మంత్రి శ్రీధర్‌బాబు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. రెండు గంటలపాటు భేటీ అయ్యారు. ఆయన మనోభావాల్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మంత్రితో భేటీ అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసి ఉదయమే జీవన్‌రెడ్డి అనుచరులు జగిత్యాలలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన వారితో మాట్లాడుతూ ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన పరిస్థితి రావడమేంటని, తనకు మాట వరసకైనా చెప్పకుండా చేర్చుకోవడమేమిటని నొచ్చుకున్నారు. తన వయసుకు, 40 సంవత్సరాల సీనియారిటీకి అధిష్ఠానం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా నాకు ఈ పార్టీ ఎందుకు.. ఎమ్మెల్సీ పదవి ఎందుకు అని అన్నారు. ఎమ్మెల్సీ తీవ్ర మనస్తాపం చెందారని తెలిసి దిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన మేరకు మంత్రి డి.శ్రీధర్‌బాబు సాయంత్రం 6:30 గంటలకు జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకుని దాదాపు రెండు గంటలపాటు మాట్లాడారు. ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మ్కణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, కోరుట్ల ఇన్‌ఛార్జి నర్సింగరావు తదితరులతో కలిసి ఆయనకు నచ్చజెప్పారు. అందరికీ మార్గదర్శకులుగా ఉన్న మీరు నిరాశ చెందవద్దని కోరారు. 

జీవన్‌రెడ్డే మాకు పెద్దదిక్కు: మంత్రి శ్రీధర్‌బాబు

జీవన్‌రెడ్డే మాకు పెద్ద దిక్కు అని మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా, లేకున్నా కార్యకర్తలు, ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి ఆయన. వారి బాటలో మేం నడుస్తున్నాం. ప్రభుత్వానికి అండగా ఉండేందుకే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నాం. కార్యకర్తల మనోభావాలను గౌరవించే బాధ్యత పార్టీపై ఉంది. జీవన్‌రెడ్డి అధైర్యపడొద్దు. ఆయన మనోభావాలు, కష్టాలను సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకువెళ్లి అన్నివిధాలా న్యాయం జరిగేలా చూస్తాం’’ అని శ్రీధర్‌బాబు చెప్పారు. ఆయనకు ఏమైనా హామీ ఇచ్చారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ఆయన పెద్దదిక్కు ఆయనకు తామేం హామీ ఇస్తామన్నారు.


ఎవరితో పోరాటం చేశానో వారినే తీసుకున్నారు: జీవన్‌రెడ్డి

భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని శాసనమండలి సభ్యుడు టి.జీవన్‌రెడ్డి అన్నారు. మంత్రి మాట్లాడి వెళ్లిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దశాబ్దకాలం ఎవరితో పోరాటం చేశామో ఆ ఎమ్మెల్యేనే ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడంతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకు అనుగుణంగా భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానన్నారు. శాసనసభలో సంఖ్యాబలం కారణమో, ప్రభుత్వానికి అండగా ఉండేందుకో ఎమ్మెల్యేను చేర్చుకునేముందు కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోవాల్సిందని పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో అనుకున్న ఫలితం రాకున్నా ప్రజలకు అందుబాటులో ఉన్నానని, భవిష్యత్తులో కూడా ఉంటానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని